తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీతను అరెస్ట్ చేశారు.
తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునీతను అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అధికార వైసీపీ శ్రేణులు తమపై దాడి చేస్తున్నారని టీడీపీ చెబుతోంది. ఈ క్రమంలోనే పుంగనూర్ ఘటనపై నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. మాజీ మంత్రి పరిటాల సునీత కూడా ఈరోజు రాప్తాడు నియోజకవర్గం టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం గేట్ సర్కిల్ వద్ద నిరసన తెలిపేందుకు బయలుదేరారు.
అయితే పరిటాల సునీతను, టీడీపీ శ్రేణులను మరూరు టోల్ గేట్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ టోల్ ప్లాజా వద్ద పరిటాల సునీత, టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ.. చంద్రబాబుపై రాళ్లు వేస్తే పోలీసులు అడ్డుకోరు కానీ.. తమను మాత్రం అడ్డుకుంటారని మండిపడ్డారు. చంద్రబాబుపై, టీడీపీ నేతలపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. తమ ప్రాణాలు పోయిన చంద్రబాబును రక్షించుకుంటామని అన్నారు. చంద్రబాబు నాయుడు ఒక్క మాట చెబితే.. వైసీపీ గుండాలు రోడ్ల మీద తిరగలేరని కామెంట్ చేశారు. ఇక, నిరసనకు దిగిన పరిటాల సునీతను, టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
