మద్యం మత్తులో ఓ కొడుకు... కన్న తల్లి పట్ల నీచంగా ప్రవర్తించాడు. తల్లి చీర కొంగు లాగాడు. ఆ కొడుకు ప్రవర్తన చూసి తల్లి తట్టుకోలేకపోయింది. భర్త సహాయంతో... అదే చీర కొంగుతో కొడుకు ఉరి వేసింది. ఈ సంఘటన అనంతపురంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అనంతపురం లోని శిరివరం గ్రామానికి చెందిన కదిరమ్మ, నరసింహప్ప దంపతుల ఏకైక కుమారుడు నారాయణస్వామి ఉన్నాడు. నారాయణ స్వామికి కూడా పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బెంగళూరులో బేల్దార్‌ పని చేస్తూ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడు.

కాగా... ఇటీవల కాలంలో నారాయణస్వామి మద్యానికి బానిసయ్యాడు. ఊరికి వచ్చినప్పుడల్లా  మద్యం తాగి భార్య, తల్లిదండ్రులతో గొడవపడే వాడు. దీంతో వేధింపులు తాళలేక కొన్ని నెలల క్రితం  పిల్లలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే సోమవారం రాత్రి 8 గంటల సమయంలోబాగా మద్యం సేవించిన నారాయణస్వామి తల్లిదండ్రులతో గొడపడ్డాడు. 

ముగ్గురూ ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో తల్లి కదిరమ్మ చీరను పూర్తిగా లాగేశాడు. సహనం కోల్పోయిన తల్లిదండ్రులు అదే చీరను నారాయణస్వామి మెడకు బిగించడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.