ప్రకాశం: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ కీలక నేత రామనాథం బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 

సీఎం వైయస్ జగన్ రామనాథంకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రామనాథం బాబుతోపాటు ఆయన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వారికి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ కండువాకప్పి సాదరంగా ఆహ్వానించారు. 

వైఎస్‌ జగన్‌ సుపరిపాలన చూసి వైసీపీలో చేరుతున్నట్లు రామనాథం బాబు తెలిపారు. విశాల హృదయంతో తనను సీఎం జగన్ పార్టీలో చేర్చుకున్నారని స్పష్టం చేశారు. వైసీపీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సీఎం జగన్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. దేశంలోనే మంచి సీఎంగా జగన్ పేరుతెచ్చుకున్నారని రామనాథం బాబు ప్రశంసించారు. 

ఎన్నికలకు ముందు పార్టీకి గుడ్ బై చెప్పి తిరిగి జగన్ గూటికి:
ఇకపోతే రామనాథం బాబు ఎన్నికలకు ముందు పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ కీలక నేతగా వ్యవహరించారు. పర్చూరు నియోజకవర్గం ఇంచార్జ్ గా వ్యవహరించారు. అయితే ఆకస్మాత్తుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు సీన్ లోకి దిగడంతో ఆయన అలకబూనారు. 

చివరకు టికెట్ సైతం దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి కేటాయించడంతో రామనాథం బాబు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లాకు విచ్చేసిన చంద్రబాబు సమక్షంలో రామనాథం బాబు టీడీపీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించారు. 

అయితే రామనాథం బాబు గతకొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ వీడాలని నిర్ణయిం తీసుకున్నారు. తాజాగా వైసీపీలో చేరారు. 

ప్రస్తుతం పర్చూరు వైసీపీ ఇంచార్జ్ గా దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరడాన్ని నిరసిస్తూ రామనాథం బాబు టీడీపీలో చేరారు. తిరిగి సొంతగూటికి చేరడంతో దగ్గుబాటి వర్గంతో ఎలా కలుపుకుపోతారా అన్నది సస్పెన్షన్ గా మారింది.