కడప: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో తన తమ్ముడుకి ఎలాంటి సంబంధం లేదని పరమేశ్వర్ రెడ్డి సోదరుడు రామశంకరరెడ్డి స్పష్టం చేశారు. పరమేశ్వర్ రెడ్డి వైఎస్ వివేకాను హత్య చేశారంటూ వస్తున్న వార్తలతో తమ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతోందన్నారు. 

పులివెందుల అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డా అంటూ చెప్పుకొచ్చారు. తమ కుటుంబానికి వైఎస్ కుటుంబానికి గత 30 ఏళ్లుగా మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తమ సోదరుడు రామలింగారెడ్డి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడంటూ చెప్పుకొచ్చారు. 

వైఎస్ వివేకా చనిపోయిన తర్వాత చూడలేదన్న కారణంతోనే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారని చెప్పుకొచ్చారు. కసునూర్ లో ఒకప్పుడు తమకు బీటెక్ రవి కుటుంబ సభ్యులకు ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయన్నారు. 

గతంలో బీటెక్ రవి కుటుంబ సభ్యులు తమ సోదరుడుని హత్య చేశారని ఆనాటి నుంచి తమకు ఆ కుటుంబానికి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయని ఆరోపించారు. తమ సోదరుడుని హత్య చేసినందుకు ప్రతీకగా బీటెక్ రవి చిన్నాన్నను తాము హత్య చేశామని తెలిపారు. 

అయితే ఫ్యాక్షన్ గొడవలకు స్వస్తి చెప్పాలని తాము బీటెక్ రవి కుటుంబ సభ్యులం కలిసి నిర్ణయించుకున్నారని తెలిపారు. తమ కుటుంబం భవిష్యత్ కోసమే తాము టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. వైఎస్ వివేకాతో తన సోదరుడు పరమేశ్వర్ రెడ్డి గత 30 ఏళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడని తెలిపారు. 

తమ కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నామని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబం కోసం అవసరమైతే ప్రాణాలు ఇచ్చేవాళ్లమే తప్ప ప్రాణాలు తీసేవాళ్లం కాదని పరమేశ్వర్ రెడ్డి సోదరుడు రామశంకర్ రెడ్డి స్పష్టం చేశారు.