అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. జగన్ పదే పదే చేస్తున్న విమర్శలు తనను బాధించాయని ఆయన తన రాజీనామా లేఖలో చెప్పారు.

తన రాజీనామా లేఖను పరకాల ప్రభాకర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పంపించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. తాను కొనసాగడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశ్యాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. 

బిజెపితో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్న పరిస్థితిలో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని అంటున్నారు. కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ భర్త అయిన పరకాల ప్రభాకర్ చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వంలో మీడియా సలహాదారుగా ఉండడాన్ని ప్రస్తావిస్తూ బిజెపితో చంద్రబాబు స్నేహం కొనసాగుతోందని జగన్ వ్యాఖ్యానించారు. 

గత కొద్ది కాలంగా జగన్ చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. కేంద్రంపై చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాటంపై అనుమానాలు కలిగే విధంగా తన పదవిని ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

తాను ప్రభుత్వంలో కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు భంగం వాటిల్లకూడదన్న ఉద్దేశంతో రాజీనామా చేసినట్టు పరకాల చెప్పారు. తన కుటుంబంలోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉండటం, అందులోనూ తనకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందున, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను రాజీపడతానని కొందరు ప్రచారం చేస్తున్నారని న్నారు. 

ఆ ప్రచారం నేపథ్యంలోనే  సలహాదారు పదవిని వదులుకుంటున్నట్టు లేఖలో తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.