Asianet News TeluguAsianet News Telugu

టిడిపి హయాంలోనే రాష్ట్రాభివృద్ది...నేను కాదు వైసీపీ ప్రభుత్వమే చెబుతోంది: అనురాధ

టిడిపి అధికారంలో వుండగా తీసుకువచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ వల్ల ఐదు లక్షల 70 వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 10 లక్షలు పరోక్ష ఉద్యోగాలు వచ్చాయి. 

panchumarthi anuradha comments on ycp  industrial policy
Author
Vijayawada, First Published Aug 11, 2020, 12:23 PM IST

విజయవాడ: వైసిపి ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానంపై టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. టిడిపి హయాంలో తీసుకువచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ పారిశ్రామికాభివృద్ది తోడ్పడితే వైసిపి ప్రభుత్వంలో పారిశ్రామిక రంగంలో రాజకీయ జోక్యం ఎక్కువయ్యిందన్నారు. అందువల్లే పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదని అనురాధ అన్నారు. 

''ఒక ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తే ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ది చెందేలా ఉండాలి. ఉద్యోగాలు వచ్చేలా, తలసరి ఆదాయం పెరిగేలా ఉండాలి. టీడీపీ హయాంలో ఇవన్నీ అమలయ్యే విధంగా ఇండస్ట్రియల్ పాలసీ తేవడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ అనేకసార్లు నెంబర్ వన్ గా నిలిచింది. తలసరి ఆదాయం పెరిగింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఆ పాలసీ తోడ్పడింది'' అని గుర్తుచేశారు. 

''తమ ఇండస్ట్రియల్ పాలసీ వల్ల ఐదు లక్షల 70 వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 10 లక్షలు పరోక్ష ఉద్యోగాలు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, ఐటీ, ఫార్మా రంగాల్లో అనేక పరిశ్రమలు వచ్చాయి. ఇది మేము చెప్పడం కాదు...వైసీపీ తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీలోనే రాశారు'' అని అన్నారు.  

''2018-19కి గానూ పారిశ్రామికంగా ఎగుమతుల్లో రూ. 98, 993 కోట్ల లావాదేవీలు జరిగాయని బుక్ లో రాశారు. 2019-20లో వైసీపీ ప్రభుత్వం ఏం సాధించిందో ఎక్కడా ప్రస్తావించలేదు. పారిశ్రామికాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ముందుకురావడంలేదని దీన్ని బట్టే తెలుస్తోంది. వాళ్లు చెప్పుకోడానికి ఏం లేదు కాబట్టే టీడీపీ హయాంలో జరిగింది రాశారు'' అని  పేర్కొన్నారు.

''తమ ప్రభుత్వ ఇండస్ట్రియల్ పాలసీ బ్రహ్మాండమని వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టిమరీ గొప్పలు చెబుతున్నారు. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, బడుగు , బలహీన వర్గాలను దెబ్బతీసేలా వైసీపీ ఇండస్ట్రియల్ పాలసీ ఉంది. టీడీపీ హయాంలో ఇచ్చిన 75 లక్షల సబ్సిడీని వైసీపీ ప్రభుత్వం 50 లక్షలకు కుదించేసింది. విద్యుత్ రాయితీలు కూడా కుదించేశారు. ఇదేనా ఇండస్ట్రియల్ పాలసీ అంటే?'' అని నిలదీశారు. 

read more  నూతన పారిశ్రామిక విధానంపై మండిపడ్డ యనమల

''ఈజ్ ఆఫ్ డూయింగ్ లో భాగంగా టీడీపీ హయాంలో తెచ్చిన పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ చట్టం వల్ల 74 సేవలు నిర్ణీత సమయంలో పారిశ్రామిక వేత్తలకు అందాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అవంతి సీడ్స్, పతంజలి, పార్లే, జెర్సీ, కాంటినెంటల్ కాఫీ , గోద్రెజ్, టాటా ఫుడ్స్,  అలాగే ఇండియన్ డిజైన్, అర గ్రూప్, గుంటూరు టెక్స్ టైల్ పార్క్ వంటివి ఏపీకి వచ్చాయి. ఆటోమొబైల్ రంగంలో కియా మోటార్స్ , ఇసుజా, అపోలో టైర్, అశోక్ లేల్యాండ్, హీరో గ్రూప్  వచ్చాయి. సెల్ ఫోన్ రంగంలో సెల్ కాల్, డిస్పన్, టీసీఎల్ ,వోల్టాస్,  ఫార్మా రంగంలో అరబిందో, రెడ్డీ ల్యాబ్స్ , దివీస్ వచ్చాయి. పర్యాటక రంగంలో నోవాటెల్ , హాలిడే ఇన్, మై ఫార్చూన్ వచ్చాయి. టీడీపీ హయాంలో వచ్చినవి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో గంట పడుతుంది. పారిశ్రామిక వేత్తలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్లే ఏపీకి పరిశ్రమలు క్యూ కట్టాయి''అని వివరించారు. 

''వైసీపీ హయాంలో 2 లక్షల పెట్టుబడులు వెనక్కు పోయాయి. విజయవాడ గేట్ వేలో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏం సాధించారు? వచ్చిందే 15 మంది అందులో ఇద్దరిని మించి సీఎం కలవలేదు. పారిశ్రామిక విధానంలో రాజకీయ జోక్యం ఎక్కువవడం వల్ల పారిశ్రామికవేత్తలు బెదిరిపోయారు. కియా మోటార్స్ విషయంలో స్థానిక వైసీపీ ఎంపీ ఎలా వ్యవహరించారో మనం చూశాము. రాజకీయ బెదిరింపుల వల్ల పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రమిక వేత్తలు వెనకడుగు వేస్తున్నారని ఈ ప్రభుత్వం ఎందుకు గమనించడం లేదు?'' అని ప్రశ్నించారు. 

''సంపద సృష్టించే విధంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఒక్క పాలసీ అయినా చేసిందా? సంపద సృష్టించే అమరావతి, విశాఖ, తిరుపతి సహా అన్ని జిల్లాలను నిర్వీర్యం చేసేశారు. రాజకీయ నేతలను మేము సంతృప్తి పరచలేకపోతున్నాం, మాకు ఈ నాలుగేళ్లు అవసరం లేదని పారిశ్రామివేత్తలు బహిరంగంగా చెబుతున్నారంటే ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో అర్దమవుతుంది. బడుగు, బలహీన వర్గాల నడ్డి విరచడమేనా ఇండస్ట్రియల్ పాలసీ అంటే?'' అని అడిగారు. 

''నైపుణ్యాభివృద్ధి మీద మేము ఎంతో శ్రద్ధ పెట్టామని ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబు హయాంలో అమరావతిలో కట్టిన స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఎందుకు నిరూపయోగంగా వదిలేశారో సమాధానం చెప్పండి. రాజుగారివి వంద కాళ్లు- నాది ఒక ఎద్దు అనే సామెతగా వైసీపీ ఇండస్ట్రియల్ పాలసీ ఉంది. చంద్రబాబు గారి కష్టాన్ని వైసీపీ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు'' అని విమర్శించారు. 

''బడుగు, బలహీన వర్గాలకు లోటు రాకుండా చూసుకుంటామని చెప్పిన వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తోంది? పారిశ్రామికంగా బడుగు, బలహీన వర్గాలు ఎదగకూడదా? వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ ...పారిశ్రామిక వేత్తలను సంతృప్తి పరిచేలా లేదు. టీడీపీ హయాంలో ఇచ్చిన నిరుద్యోగ భృతిని వైసీపీ ఆపేసింది.  టీడీపీ హయాంలో బడుగు, బలహీన వర్గాలకు పారిశ్రామికంగా పెద్దపీట వేశారు. ఆ పాలసీలనే వైసీపీ అమలు చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది'' అని అనురాధ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios