ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడం కోసం విడుదల చేసిన సొమ్ముపై అతడి కన్ను పడింది. ఇంకేముంది ఆ డబ్బులు తీసుకుని పరారయ్యాడు. అలాగని అతడు ఏ దోపిడీ దొంగో అనుకుంటే పొరబడినట్లే. ఆ డబ్బులకు ప్రజలకు అందేలా చూడాల్సిన ప్రభుత్వ అధికారి అతడే. ఇలా అత్యాశకు పోయి ఏకంగా ప్రభుత్వ ఖజానాకే కన్నం వేసిన అతడు ఉద్యోగాన్ని కోల్పోవడంతో పాటు పోలీసు కేసును ఎదుర్కొంటున్నాడు. 

చిత్తూరు జిల్లా  శ్రీకాళహస్తి మండలం పాన‌గల్‌‌కు చెందిన  నాగరాజు  సత్యవేడు మండలంలోని సిరణంబూదూరు, కదిరివేడుపాడు గ్రామాలకు పంచాయితీ కార్యదర్శిగా పనిచేసేవాడు. అయితే రెండు రోజుల క్రితం ఈ గ్రామాల్లోని పింఛనుదారులకు ఈ నెల అందించాల్సిన రూ.11లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది.  పింఛనుదారులకు పంపిణీ చేయడానికి ఈ డబ్బులను తీసుకున్న నాగరాజుకు వాటిని చూడగానే వక్రబుద్ది పుట్టింది. దీంతో ఈ పింఛను సొమ్మును తీసుకుని పరారయ్యాడు. 

గత రెండు రోజులుగా నాగరాజు విధులకు రాకపోవడంతో ఎంపీడీవో జ్ఞానేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగరాజు కోసం గాలిస్తున్నారు.  ఈ ఘటనపై ఉన్నధికారులకు సమాచారం అందించడంతో వారు నాగరాజు ను సస్పెండ్ చేశారు.