కుక్కల భయం కరోనా పై పోరును సలుపుతున్న ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఉద్యోగ విధులను ముగించుకొని ఇంటికి పయనమైన ఆమెపై కుక్కల రూపంలో మృత్యుపాశం విసిరింది విధి. ఆ భయంతో తాను ప్రయాణిస్తున్న బండి మీది నుంచి కిందకు దూకి ప్రాణాలు కోల్పోయింది. 

ఈ హృదయాన్ని కదిలించివేసే సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.ఒంగోలు రూరల్ మండలం త్రోవగుంటకు చెందిన సువర్ణలక్ష్మి, పక్కనున్న మార్టూరు మండలం వలపర్ల గ్రామంలో పంచాయితీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. 

ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు గ్రామంలో అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, గ్రామంలోని వారందరికీ కూడా ఈ కరోనా పై అవగాహనా కల్పించి తన విధులను ముగించుకొని ఆమె తన బంధువు తో ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. 

మార్గమధ్యంలో రహదారి వెంబడి ఉండే కుక్కలు అరుస్తూ ఆ ద్విచక్ర వాహనాన్ని వెంబడించాయి. ఇలా ఒక్కసారిగా కుక్కలు వెంబడించడంతో భయాందోళనలతో గురైన సువర్ణ లక్ష్మి బండి మీదనుంచి దూకింది. 

బండి మీద నుంచి రహదారిపైకి దూకడంతో ఆమె తల రోడ్డుకు బలంగా తాకింది. తీవ్ర గాయాలపాలైన సువర్ణ లక్ష్మిని ప్రైవేట్ వాహనంలో ఒంగోలు లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెన్ చికిత్స పొందుతూ ప్రాణాలను విడిచింది. 

బంధువు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుకి చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా టెస్టింగ్ సామర్ధ్యం పెంచామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సోమవారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఇలాంటి విపత్తులు వస్తే పరీక్షించే సదుపాయాలు లేవన్నారు.

దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటేనని జగన్ స్పష్టం చేశారు. దేశం మొత్తం మీద 10 లక్షల జనాభాకు 451 టెస్టులు చేస్తున్నారని.. ఇదే సమయంలో ఏపీలో సగటున 1,396 కరోనా పరీక్షలు జరుగుతున్నాయని జగన్ వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా 9 చోట్ల కరోనా టెస్టింగ్ కేంద్రాలు, 9 వీఆర్‌‌డీఎల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 54 మండలాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయని, దాదాపు 80 శాతం రాష్ట్రం గ్రీన్‌జోన్‌లో ఉందని జగన్ వెల్లడించారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు 74,551 మందికి టెస్టులు నిర్వహించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇదే సమయంలో కేవలం 63 మండలాలు మాత్రమే రెడ్‌జోన్‌లో ఉన్నాయని.. లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలకు జగన్ ధన్యవాదాలు తెలిపారు.