అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తన టీం సిద్ధం చేసుకున్నారు. తన కేబినెట్ లో 25 మందికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. జగన్ కేబినెట్ కూర్పు చాలా వ్యూహాత్మకంగా జరిగింది. ఏ సామాజిక వర్గాన్ని నొప్పించకుండా మంత్రి వర్గం కూర్పు చేపట్టారు జగన్. 

వైయస్ జగన్ కేబినెట్ లో అంతా 39 సంవత్సరాలు పైబడిన వారే ఉంటే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే 31 ఏళ్లు ఉన్నాయి ఆమె విజయనగరం జిల్లా కురుపాం శాసన సభ్యురాలు పాముల పుష్పశ్రీవాణి. ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో యంగ్ మినిస్టర్ గా ఆమె గుర్తింపు పొందారు. 

పాముల పుష్పశ్రీవాణి కురుపాం నియోజకవర్గం నుంచి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వేవ్ నడుస్తున్నప్పటికీ ఆమె మాత్రం గెలుపొందారు. 

పాముల పుష్పశ్రీవాణిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు అనేకమంది ప్రయత్నంచారు. కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీలో చేరిపోయినప్పటికీ పాముల పుష్పశ్రీవాణి మాత్రం పార్టీ మారలేదు. పాముల పుష్పశ్రీవాణి టీడీపీ ప్రలోభాలకు లొంగకపోవడంతో ఆమె భర్త పరీక్షిత్ రాజును కూడా ఆశ్రయించారు టీడీపీ నేతలు. 

అనేక ప్రలోభాలకు గురి చేశారు. కానీ ఆమె మాత్రం పార్టీ వీడేది లేదని స్పష్టం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కురుపాం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆమె అన్నమాటలు జగన్ మనస్సును హత్తకున్నాయి.

కట్టేకాలేవరకు జగన్ అన్నతోనే ఉంటానని ఆమె ప్రామిస్ చేశారు. తనను తెలుగుదేశం పార్టీలో చేరాలంటూ ఎంతోమంది ఒత్తిడులు తెచ్చారు. కుటుంబంలో చీలికతెచ్చే ప్రయత్నం చేశారు కానీ దేనికి భయపడలేదు. మాకు జగన్ అన్న ఉన్నాడంటూ ఉన్నామని చెప్పుకొచ్చారు. 

జగన్ అన్నకి చెప్తున్నా కట్టేకాలేవరకు నీతోనే పయనం అంటూ ఆమె బహిరంగ సభలో భావోద్వేగంగా మాట్లాడారు. పాముల పుష్పశ్రీవాణి మాటలు విన్న వైయస్ జగన్ ఆమెకు మంచి భవిష్యత్ ఉంటుందని హామీ ఇచ్చారు. 

చెల్లి పుష్పశ్రీవాణిని గుండెల్లో పెట్టుకుంటానంటూ మాట ఇచ్చారు. అలా పాదయాత్రలో ఇచ్చిన మాటకు విలువనిచ్చిన వైయస్ జగన్ తన కేబినెట్ లో పుష్పశ్రీవాణికి అవకాశం ఇచ్చారు. జగన్ కు విధేయురాలిగా, పార్టీపట్ల క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఆమె మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో అతిచిన్న మంత్రిగా కూడా ఛాన్స్ కొట్టేశారు. ఆమె తర్వాత యంగ్ మినిస్టర్ గా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.