వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్‌ కుటుంబాన్ని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్‌కి భద్రత తగ్గించారని వైసీపీ నేతలు చంద్రబాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.

పల్నాడు జిల్లా వినుకొండలో నడిరో­డ్డుపై దారుణంగా హత్యకు గురైన వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్‌ కుటుంబాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహ‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. రషీద్‌ చిత్రపటానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. రషీద్‌ తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధైర్యపడవద్దు..అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

కాగా, శుక్రవారం ఉద‌యం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన వైయ‌స్ జ‌గ‌న్‌... గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్‌ మీదుగా వినుకొండ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ భద్రతపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వినుకొండ పర్యటన నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచే జగన్‌కు భద్రతను తగ్గించారని.. ఆయనకు పాత బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాన్ని కేటాయించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రిపేర్‌లో ఉన్న బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనం ఇవ్వడంతో మార్గంలో పలుమార్లు వాహనం మొరాయించిందని తెలిపారు.

పలుమార్లు వాహనం మొరాయించడంతో మార్గం మధ్యలోనే బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనం నుంచి దిగిన వైఎస్‌ జగన్‌.. మరో వాహనంలో వినుకొండకు వెళ్లారు. రోడ్డుకు ఇరువైపులా భారీగా ఉన్న కార్యకర్తలు, ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జోరుగా వ‌ర్షం కురుస్తున్నా జ‌నం రోడ్ల‌పైకి వ‌చ్చి జ‌గ‌న్‌కు స్వాగతం పలికారు. భారీగా తరలివచ్చిన ప్ర‌జ‌ల‌కు జగన్ కారు దిగి‌ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్ జగన్ వెంట నాయకుల వాహనాలు రాకుండా పోలీసులు అడ్డుకున్నా.. అలాగే ముందుకు సాగారు. ఈ క్రమంలో 15 సార్లు జగన్ కాన్వాయ్‌కి ఆటంకాలు కలిగించినట్లు సమాచారం. పోలీసుల ఆంక్షలు, ఆటంకాలతో ఆలస్యంగా జగన్ వినుకొండ చేరుకున్నారు.