టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్
తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను సీనియర్ నాయకుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ కు అప్పగించింది.
Palla తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరిట ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా విశాఖపట్నం పార్లమెంటు పార్టీ అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేసిన పల్లా శ్రీనివాసరావు యాదవ్ నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని నడిపించడంలో అద్భుత పనితీరు కనబరిచిన పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు అభినందనలు తెలిపారు. ప్రతిపక్షంలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేశారని కొనియాడారు.
ఇప్పటి వరకు టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన కింజరాపు అచ్చెన్నాయుడికి రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కడంతో పార్టీ పదవీ బాధ్యతల నుంచి తప్పించారు. అచ్చెన్నాయుడు స్థానంలో పల్లా శ్రీనివాసరావు యాదవ్ ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం నియమించింది.
కాగా, ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి పల్ల ా శ్రీనివాస్ పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై 95వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఇది రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. అలాగే, బీసీ నాయకుడు కావడంతో పాటు విశాఖ పార్లమెంటు అధ్యక్షుడిగా క్రియాశీలంగా పనిచేశారన్నపేరుంది.
పల్లా శ్రీనివాసరావు యాదవ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున అభినందనలు చెబుతున్నారు.