రాత్రంతా స్మశానంలోనే గడిపిన అధికారపార్టీ ఎమ్మెల్యే

First Published 23, Jun 2018, 6:04 PM IST
palakollu tdp mla sleeping in crematorium
Highlights

రాత్రి అక్కడే బోజనం...పొద్దున టిఫిన్ కూడా...

ప్రజల్లోని మూడ నమ్మకాలను, భయాన్ని పోగొట్టడానికి ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం చేపట్టాడు. నియోజకవర్గంలో ఓ అభివృద్ది పనికి అడ్డుగావచ్చిన ప్రజల భయాన్ని పోగొట్టడానికి స్వయంగా తానే రంగంలోకి దిగి ప్రజల ప్రశంసలు పొందుతున్నారు. ఆయనే తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు లో స్మశానవాటిక అభివృద్ది పనుల కోసం ఏడాది క్రితం ప్రభుత్వం రూ. 3 కోట్ల నిధులు కేటాయించింది. అయినా స్మశానవాటిక అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లింది. దీంతో సంబంధిత అధికారులను పిలిచి ప్రశ్నించిన ఎమ్మెల్యేకు అసలు విషయం తెలిసింది. స్మశానంలో పనిచేయడానికి కార్మికులు భయపడుతున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ భయాన్ని పోగొట్టడానికి తానే స్వయంగా రంగంలోకి దిగారు.

చీకటిపడే ముందు స్మశానంలోకి చేరుకున్న ఎమ్మెల్యే రామానాయుడు రాత్రంతా అక్కడే పడుకున్నారు. రాత్రి భోజనం తో పాటు ఉదయం అల్పాహారం కూడా అక్కడే చేశారు. అనంతరం అధికారులతో అభివృద్ది పనుల గురించి చర్చించారు.

అయితే ఎమ్మెల్యే ప్రయత్నానికి కార్మికుల భయం పోయిందో లేదో తెలీదు కానీ అభివృద్ది పనుల కోసం ఆయన చూపిన దైర్యానికి నియోజకవర్గ ప్రజలు మాత్రం మెచ్చుకుంటున్నారు. ఓ ఎమ్మెల్యే స్వయంగా స్మశానంలో పడుకుని యుద్ధప్రాతిపదికన పనులు  జరిగేలా చేయడం అభినందిచాల్సిన విషయమే అంటున్నారు.

 

loader