ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో పాడేరు ఒకటి. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొత్తగుల్లి భాగ్యలక్ష్మి కొనసాగుతున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని వైసిపి ఇంకొకరికి అవకాశం ఇవ్వడం... టిడిపి, బిజెపి మధ్య ఈ సీటుకోసం పోటీ చూస్తుంటే ఎంతటి హాట్ హాట్ రాజకీయాలు సాగుతున్నాయో అర్థమవుతుంది. తాజా రాజకీయాల నేపథ్యంలో పాడేరు ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. 

పాడేరు రాజకీయాలు :

పాడేరు రాజకీయాల్లో వారసురాళ్ల హవా సాగుతోంది. 1972లో పాడేరు ఎమ్మెల్యేగా పనిచేసిన గిడ్డి అప్పలనాయుడు కూతురు గిడ్డి ఈశ్వరి... 1985,1994 లో ఎమ్మెల్యేగా పనిచేసిన కొత్తగుల్లి చిట్టినాయుడు కూతురు కొత్తగుల్లి భాగ్యలక్ష్మి ఎమ్మెల్యేలుగా పనిచేసారు. 2014 లో ఈశ్వరి, 2019 లో భాగ్యలక్ష్మి వైసిపి తరపున పోటీచేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 

అయితే ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలోనే వైసిపిని వీడి టిడిపిలో చేరారు గిడ్డి ఈశ్వరి. ఆ తర్వాత 2019 లో టిడిపి నుండి ఈశ్వరి, వైసిపి నుండి భాగ్యలక్ష్మి పోటీచేసారు... ఈ ఎన్నికల్లో వైసిపి హవా వుండటంతో భాగ్యలక్ష్మి గెలిచారు. అయితే ప్రస్తుతం భాగ్యలక్ష్మిని అరకు లోక్ సభకు పంపి మత్స్యరస విశ్వేశ్వరరావు అసెంబ్లీకి పోటీ చేయిస్తోంది వైసిపి. టిడిపి కూడా పొత్తులో భాగంగా పాడేరు సీటును బిజెపికి కేటాయించేలా కనిపిస్తోంది. ఇలా 2019 పోటీచేసిన మహిళలిద్దరికీ ఈసారి అవకాశం దక్కడంలేదు. 

పాడేరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. జి. మాడుగుల 
2. చింతపల్లి
3. గూడెం కొత్తవీధి 
4. కొయ్యూరు
5. పాడేరు 

పాడేరు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,27,117
పురుషులు - 1,10,529
మహిళలు ‌- 1,16,572

పాడేరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొత్తగుల్లి భాగ్యలక్ష్మిని అరకు లోక్ సభ బరిలో నిలిపింది వైసిపి. పాడేరు అసెంబ్లీ బరిలో మత్స్యరాస విశ్వేశ్వరరాజును దింపింది.

టిడిపి, బిజెపి మధ్య పోటీ :

ఇప్పటికే టిడిపి, జనసేన, బిజెపి మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో పాడేరు సీటు విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సీటును టిడిపి, బిజెపి పట్టుబడుతున్నారు... అయితే ఈ సీటును బిజెపికి వదిలిపెట్టేందుకు టిడిపి సిద్దమైనట్లు తెలుస్తోంది. అందుకోసమే టిడిపి అభ్యర్థిని ప్రకటించలేదు.

పాడేరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

పాడేరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,40,098 (62 శాతం)

వైసిపి - కొత్తగుల్లి భాగ్యలక్ష్మి - 71,153 ఓట్లు - 42,804 ఓట్ల మెజారిటీతో ఘన విజయం 

టిడిపి - గిడ్డి ఈశ్వరి ‌‌- 28,349 ‌- ఓటమి

పాడేరు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,27,849 (59 శాతం)

 వైసిపి - గిడ్డి ఈశ్వరి - 52,384 (40 శాతం) ‌- 26,141 ఓట్ల మెజారిటీతో విజయం 

సిపిఐ - దేముడి గొడ్డేటి - 26,243 (20 శాతం) - ఓటమి