కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్న భోజనం వికటించింది. మధ్యాహ్న భోజనం తిని 40 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నంద్యాలలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 40 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల పట్టణంలోని విశ్వనగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంతో ఈ ఘటన జరిగింది. మధ్యాహ్న భోజనం తిన్నవారిలో కొందరు విద్యార్థులు వెంటనే వాంతులు చేసుకున్నారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు వారిని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

ఇందుకు సంబంధించిన సమాచారం అందుకున్న డీఈవో.. నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో సాంబరు, గుడ్డు తిన్న విద్యార్థులు కొందరు అస్వస్థతకు గురయ్యారని.. పాడైన గుడ్లు వడ్డించడం వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్పారు. పిల్లలు అస్వస్థతకు గురికావడానికి కారణమైనవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ఆహారం కలుషితమై వాంతులతో విద్యార్థులు చేరిన వెంటనే వారికి మెరుగైన చికిత్స అందజేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్‌ వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని, చికిత్స తర్వాత విద్యార్థులను డిశ్చార్చ్‌ చేస్తామని ఆయన అన్నారు.