ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కి చెందిన తాడేపల్లి నివాస గృహం, క్యాంపు ఆఫీసుకు కొత్తగా కిటికీలు, తలుపులు అమర్చేందుకు రూ.73 లక్షలు మంజూరు చేస్తూ రోడ్లు భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  ఎన్నికల ముందే ఈ నివాసాన్ని నిర్మించుకున్నప్పటికీ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత భద్రత కారణాల దృష్ట్యా అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. 

ఈ పనుల కోసం ఆర్‌అండ్‌బీకి అనుమతులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో గత నెల 15వ తేదీన వెలువడింది. ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు అభివృద్ధి, భద్రతా చర్యల కోసం రూ.15 కోట్లు విడుదల చేశారు. 

ఇలా ఇంత భారీ స్థాయిలో ఖర్చుపెడుతుండడంతో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ట్విట్టర్ వేదికగా, జగన్ జీతమేమో ఒక్క రూపాయి తీసుకుంటున్నాడు మరి ఈ ఖర్చులెంట్ని ఎద్దేవా చేసారు. రాష్ట్రం తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వేళ ఇలాంటి ఏర్పాటలేంటని మండిపడ్డారు. సోషల్ మీడియాలో అయితే కోర్టు కు వెళ్ళడానికి డబ్బుల్లేవుగాని, ఇలా ఈ స్థాయిలో నూతన హంగులకోసం మాత్రం ఖర్చు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

Also read: చంద్రబాబు ట్వీట్ వైరల్: వైఎస్ జగన్ ఇంటి కిటికీలకు రూ.73 లక్షలు 

ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రి అయినా దగ్గర నుండి ఇంటి కోసం,పరిసరాల అభివృద్ధి కోసం భారీ స్థాయిలోనే ఖర్చు చేసారు. జగన్‌ నివాసం వద్ద రహదారిని వెడల్పు చేసేందుకు రూ.5 కోట్లు కేటాయించారు. జగన్‌ రక్షణకోసం పరిసరాల్లో తదుపరి చర్యలు చేపట్టేందుకు రూ. 1.89 కోట్లు విడుదల చేస్తూ ఆర్‌అండ్‌బీ మే 26న ఉత్తర్వులు జారీ చేసింది. జగన్‌ ఇంటి వద్దే ప్రత్యేకంగా హెలిప్యాడ్‌, దానికి ఫెన్సింగ్‌, ఇంకా అక్కడికి వెళ్లడానికి అప్రోచ్‌ రోడ్‌ నిర్మాణం కోసం రూ.40 లక్షలు, 

హెలిపాడ్‌ వద్ద గార్డ్‌ రూమ్‌ , ఇతర సదుపాయాలకోసం రూ. 13.50 లక్షలు, సీఎం నివాసం వద్ద పర్మినెంట్‌ బారికేడింగ్‌ ఏర్పాటుకు రూ. 75 లక్షలు, సీఎం ఇంటి సమీపంలోనే పోలీస్‌ బ్యారెక్‌, సదుపాయాలకోసం రూ. 30 లక్షలు, సెక్యూరిటీ పోస్ట్‌, సెక్యూరిటీ గేట్స్‌, పోర్టా క్యాబిన్‌ల ఏర్పాటుకు రూ. 31 లక్షలు కేటాయించారు.

సీఎం ఇల్లు, దాని పరిసరాల్లో నిరంతరం విద్యుత్తు సరఫరా, నిర్వహణ చేపట్టే నిపుణులైన సిబ్బంది కోసం రూ.8.50 లక్షలను విడుదల చేసారు. జగన్‌ ఇంటికి అత్యాధునిక విద్యుత్‌ వ్యవస్థ, లైట్స్‌, సీసీటీవీ సదుపాయం, యూపీఎస్‌ ఏర్పాటుకోసం రూ. 3.63 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యాధునిక విద్యుత్‌ టాన్స్‌ఫార్మర్‌, హెచ్‌టీ లైన్‌, ఆధునిక లైటింగ్‌ సిస్టమ్‌కు రూ.97 లక్షలు కేటాయించారు. 

Also read: రిలయన్స్ ను వెళ్లగొట్టారు, అమరావతిని చంపేశారు: జగన్ పై బాబు ఫైర్

సీసీటీవీ, సోలార్‌ ఫెన్సింగ్‌ కోసం రూ. 1.25 కోట్లు ఖర్చుచేయాలని ప్రతిపాదించారు. ఇంటితోపాటు, క్యాంపు ఆఫీసు బయట లైటింగ్‌ కోసం రూ. 11.50 లక్షలు కేటాయించారు. హైదరాబాద్‌ సచివాలయంలోని ఎల్‌-బ్లాక్‌లో ఉన్న యూపీఎ్‌సను తొలగించి దాన్ని జగన్‌ ఇంట్లో ఏర్పాటు చేసారు. ఇందుకోసం 11 లక్షల రూపాయల ఖర్చు అయింది. సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్భార్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని నిర్మాణం కోసం రూ. 82.50 లక్షలు కేటాయించారు. 

క్యాంపు ఆఫీసులో తాత్కాలికంగా షెడ్లు, మొబైల్‌ టాయిలెట్స్‌, కూలర్ల కొనుగోలుకు రూ.22.50 లక్షలు కేటాయించారు. జగన్‌ ఇళ్లు, క్యాంపు ఆఫీసులో కొత్తగా ఆల్యూమినియం తలుపులు, కిటికీలు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు రూ. 73 లక్షలు కేటాయిస్తూ అక్టోబరు 15న ఆర్‌అండ్‌బీ ఉత్తర్వులు జారీ చేసింది.క్యాంపు ఆఫీసు రక్షణ చర్యల్లో భాగంగా వ్యూకట్టర్‌ ఏర్పాటు కోసం భూమిని సేకరించారు. ఈ భూమిపరిహారం కోసం రూ.3.25 కోట్లు విడుదల చేసారు.