World Cultural Festival 2025:  సత్యసాయి శతజయంతి సందర్భంగా ముద్దెనహళ్లిలోని సత్యసాయి గ్రామంలో ‘ఒకే ప్రపంచం – ఒకే కుటుంబం ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం 2025’ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవం 100 రోజులు, 100 దేశాలు పాల్గొంటాయి.   

World Cultural Festival 2025: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్-కర్నాటక సరిహద్దుల్లోని ముద్దెనహళ్లిలోని సత్యసాయి గ్రామంలో 100 రోజుల ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఎన్నాడు కని వినీ ఎరుగని రీతిలో 100 దేశాలను ఒక్క వేదికపైకి తీసుకొస్తూ వరల్డ్ కల్చరల్ ఫెస్టివల్‌ని నిర్వస్తున్నారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (IGNCA)సహకారంతో ‘ఒకే ప్రపంచం – ఒకే కుటుంబం మిషన్’ (One World One Family Mission) ఈ మహోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 16న ప్రారంభమైన ఈ కార్యక్రమం నవంబర్ 23 వరకు 100 రోజులపాటు, 100 దేశాలను ఏకం చేయనుంది.

కళలు, సంగీతం, ఆధ్యాత్మికత, సేవల ద్వారా ఈ ప్రపంచాన్ని ఒక్కతాటిపైకి తీసుకరావాలనే ఉద్దేశంతో “ఒకే ప్రపంచం – ఒకే కుటుంబం” నినాదంతో, ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం 2025 ను సత్య సాయి గ్రామంలో శనివారం అద్భుతంగా ప్రారంభించారు. 100 రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవంలో 100 దేశాలు పాల్గొననున్నాయి. మానవత్వం, ఆధ్యాత్మికత, సంస్కృతి, సేవలను ఒకే వేదికపై ఏకం చేయడం ఈ వేడుక ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. సరిహద్దులు, విభజనలు ఉన్నప్పటికీ ప్రపంచంలోని మానవజాతి మొత్తం ఒకే కుటుంబం అనే ప్రధాన సందేశాన్ని ఈ మహోత్సవం ఇవ్వనున్నది.

ఈ వేడుకలో భారత ప్రభుత్వం తరఫున సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ప్రపంచ దేశాలకు భారత్ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతోందని, 100కు పైగా దేశాల ప్రతినిధులకు హృదయపూర్వక స్వాగతం పలికారు. అలాగే భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ (IGNCA) ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.

పద్మభూషణ్, మిషన్ కర్మయోగి భారత్ చైర్‌పర్సన్, కళాక్షేత్ర ఫౌండేషన్ మాజీ చైర్మన్ శ్రీ సుబ్రమణియన్ రామదొరై మాట్లాడుతూ ఈ మహోత్సవం ద్వారా “శ్రద్ధ, భాగస్వామ్యం, దాతృత్వం, సద్భావన, అవగాహన, సహకారం” వంటి విలువలను ప్రపంచ దేశాలకు వ్యాప్తం చేయబోతున్నామని తెలిపారు. కర్నాటక రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ టి.బి. జయచంద్ర మాట్లాడుతూ, ఇది కేవలం ప్రపంచ సాంస్కృతిక పండుగ మాత్రమే కాకుండా, ప్రేమ , సేవ అనే వారసత్వాన్ని కొనసాగించే స్ఫూర్తిదాయక ప్రస్థానం అని అభివర్ణించారు.

ఒకే ప్రపంచం – ఒకే కుటుంబం మిషన్ వ్యవస్థాపకుడు సద్గురు శ్రీ మధుసూదన సాయి మాట్లాడుతూ సంస్కృతిని అనుసంధానం, ఆరాటం, సహకారం, సహజీవనం, సహసృష్టి గా అభివర్ణించారు. ప్రపంచాన్ని ఏకం చేసే ప్రేమ, శాంతి, మానవీయ విలువలను అనుభవించేందుకు ఈ మహోత్సవంలో పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు. 

ఈ వేడుకలో చివరగా శ్రీ సత్యసాయి మానవ శ్రేష్ఠత విశ్వవిద్యాలయం విద్యార్థులు, సిబ్బంది చేసిన వందేమాతరం సాంస్కృతిక ప్రదర్శన హైలెట్ గా నిలించింది. 2025 ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం, భౌగోళిక సరిహద్దులు, మత భేదాలు, సంప్రదాయాలకతీతంగా మానవజాతిని ఏకం చేసే విలువలను ప్రతిబింబిస్తూ, ప్రపంచ సాంస్కృతిక-ఆధ్యాత్మిక మార్పిడిలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలవనుందని నిర్వాహకులు తెలిపారు.