ఘోర రోడ్డుప్రమాదం... స్కూల్ ఆటో బోల్తాపడి విద్యార్థిని మృతి, 14 మందికి గాయాలు
మైలవరం నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో బోల్తా పడి ఓ బాలిక మృతిచెందగా మరికొందరికి కాళ్ళుచేతులు విరిగి పరిస్థితి విషమంగా వుంది.

మైలవరం : స్కూల్ ఆటో బోల్తాపడి ఓ విద్యార్థిని మృతిచెందగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన నిన్న(మంగళవారం) సాయంత్రం ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. గాయపడిన విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా వుండగా, మరో ఇద్దరికి కాళ్లు విరిగాయి.
వివరాల్లోకి వెళితే... మైలవరం నియోజకవర్గం గుంటుపల్లిలోని డాన్ బాస్కో స్కూల్లో చుట్టుపక్కల ప్రాంతాల పిల్లలు చదువుకుంటున్నారు. స్కూల్ బస్సు సౌకర్యం లేని ప్రాంతాలకు చెందిన ఆటోల్లో వస్తుంటారు.ఇలా మంగళవారం సాయంత్రం స్కూల్ విడిచిపెట్టాక విద్యార్థులు ఆటోలో ఇళ్లకు బయలుదేరారు. ఇలా విజయవాడ భవానిపురం వైపు వెళుతున్న ఆటో ప్రమాదానికి గురయ్యింది. ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ప్రమాద సమయంలో ఆటో మొత్తం విద్యార్థులతో నిండివుంది. దీంతో ఒకరిపై ఒకరు పడిపోయి ఊపిరాడక ఐదో తరగతి బాలిక నవ్య శ్రీ అక్కడికక్కడే మృతిచెందారు. మరో 14 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులతో పాటు స్కూల్ బ్యాగులు, టిఫిన్ బాక్సులు చెల్లాచెదురుగా పడిపోయి ఘటనాస్థలంలో భయానక వాతావరణం నెలకొంది.
Read More 20మంది ప్రయాణికులతో కూడిన ఆర్టిసి బస్ యాక్సిడెంట్... తప్పిన పెను ప్రమాదం
వెంటనే స్థానికులు స్పందించి ఆటోలోంచి విద్యార్థులను బయటకు తీసారు. గాయపడిన వారిని గొల్లపూడిలోని హాస్పటల్ కు తరలించారు. విద్యార్థుల్లో ఇంకో ఇద్దరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. మరో ఇద్దరు కాళ్లు చేతులు విరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
విద్యార్థుల ఆటో యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన విద్యార్థుల పరిస్థితి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.