ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ కి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరులో శుక్రవారం నిర్వహించిన మంచినీటి పథకం ప్రారంభోత్సవానికి లోకేష్ హాజరయ్యారు.

కాగా.. ఆ కార్యక్రమంలో మంత్రి లోకేష్ ని గ్రామస్థులు అడ్డుకున్నారు. టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే సదుపాయాలు కల్పిస్తున్నారని.. మిగిలినవారికి ఇవ్వడం లేదంటూ ఓ మహిళ లోకేష్ ని నిలదీసింది. తమ ప్రాంతంలో కనీసం మంచినీరు, రోడ్డు సదుపాయాలు కూడా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెతోపాటు.. ఆ కాలనీ వాళ్లు మరికొందరు లోకేష్ ని సమాధానం చెప్పాలంటూ నిలదీశారు.

కాగా... వారికి సర్దిచెప్పేందుకు మంత్రి లోకేష్ ప్రయత్నించగా.. వాళ్లు వినిపించుకోలేదు. దీంతో.. వెంటనే మంత్రి తన కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించుకొని  అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలాంటి సంఘటనలు లోకేష్ కి ఎదురవ్వడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. అప్పుడు కూడా లోకేష్ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోవడం గమనార్హం.