ప్రెండ్ షిప్ డే రోజున దారుణ సంఘటన చోటుచేసుకుంది.  కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో రెండు వర్గాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ లో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. 

విజయవాడ: స్నేహితుల దినోత్సవం రోజునే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రెండు గ్రూప్ లకు చెందిన యువకులు నడిరోడ్డుపైనే ఘర్షణకు దిగారు. ఓ గ్రూప్ పై మరో గ్రూప్ అత్యంత దారుణంగా రాళ్లు, కర్రలతో దాడులు చేసుకుని భీభత్సం సృష్టించారు. చివరకు ఈ స్ట్రీట్ ఫైట్ లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 

ఈ గ్యాంగ్ వార్ కు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని జూపూడి గ్రామ శివారులోని కరకట్ట వద్ద మురుగు నీరు వాటర్ పాల్స్ తరహాలో వస్తుంటుంది. ఇటీవల కాలంలో అధిక సంఖ్యలో యువకులు అక్కడ కు చేరుకొని సరదాగా గడుపుతున్నారు. నీటిలో ఆడుతూ అదే వాటర్ ఫాల్స్ అన్నట్లు ఎంజాయ్ చేస్తున్నారు. 

వీడియో

అయితే నిన్న స్నేహితుల దినోత్సవం కావడం... అందులోనూ ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో యువత ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ ఒక్క సారిగా రెండు వర్గాలకు చెందిన యువకుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. దీంతో ఒకరి ఒకరు కర్రలతో, పిడి గుద్దులతో దాడులు చేసుకున్నారు. రోడ్డుపైనే అందరూ చూస్తుండగానే ఇలా ఘర్షణకు దిగారు. ఇలా రోడ్డుపై యుద్దవాాతావరణాన్ని సృష్టించారు. 

ఈ దాడులలో ఒక యువకుడు మృతి చెందాడు.మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ యువకుడి పరిస్థితి కూడా విషమంగా వున్నట్లు తెలుస్తోంది. గతం ఎన్నడూ లేని విధంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో జూపూడి గ్రామ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. స్థానిక పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. గొడవలో పాల్గొన్న ఇరు వర్గాలకు చెందిన యువకుల కోసం అన్వేషణ ప్రారంభించారు.