ఈ నిర్ణయం తీసుకొని నెల రోజులు దాటుతున్నా మంచి రోజులు లేవనే ఉద్దేశంతో చేరిక తేదీని ఖరారు చేయలేదు.  

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలోకి ఎప్పుడు చేరతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సస్పెన్స్ కి తెరపడింది. వచ్చే నెల 2వ తేదీన ఆనం .. వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడానికి నిశ్చయించుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకొని నెల రోజులు దాటుతున్నా మంచి రోజులు లేవనే ఉద్దేశంతో చేరిక తేదీని ఖరారు చేయలేదు. 

శ్రావణమాసం నడుస్తుండటంతో అధికారికంగా పార్టీలో చేరడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఆనం సన్నిహితులు, జిల్లా వైసీపీ నాయకుల సమాచారం మేరకు సెప్టెంబర్‌ 2వ తేదిన అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి ఆనం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. విశాఖపట్నంలో పార్టీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో ఈయన వైసీపీలో చేరనున్నారు. అదే రోజు వైఎస్‌ వర్థంతి కావడంతో ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు విశాఖలో ఏర్పాటు చేసే వైఎస్‌ వర్థంతి కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. వీరందరి సమక్షంలో ఆనం వైసీపీలో చేరనున్నారు. ఈ విషయం ఒకటి రెండు రోజుల్లో ఆనం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

కాగా సెప్టెంబర్‌ మొదటి వారంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి తనయుడు రాంకుమార్‌రెడ్డి కూడా వైసీపీలో చేరనున్నా రు. ఈ విషయాన్ని ఆయన ఇది వరకే ప్రకటించారు. ఈయన కూడా పార్టీలో చేరేందుకు విశాఖపట్నంనే వేదికగా ఎంచుకున్నారు.