అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపిన సమీక్షల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరువు, అకాల వర్షాలపై సమీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. 

అందులో భాగంగా ఉదయం 11 గంటలకు ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 5 దాటినా ఏ ఒక్క అధికారి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్షకు హాజరుకాలేదు. అధికారుల రాకకోసం మంత్రి సోమిరెడ్డి వేచిచూశారు. 

ఎంతసేపటికి రాకపోవడంతో ఇక చేసేది లేక సమీక్షహాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇకపోతే ఇటీవలే సమీక్షలపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తాను వ్యవసాయ శాఖ మంత్రిగా త్వరలోనే సమీక్ష చేపడతానని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ చేశారు. 

ఎవరైనా అడ్డుకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులు సమీక్షలు చెయ్యకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సమీక్షలు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే తామెందుకు, తమకు మంత్రి పదవులు ఎందుకు అంటూ చెప్పుకొచ్చారు.  

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నట్లుగానే మంగళవారం కరువు, అకాల వర్షాలపై వ్యవసాయ శాఖ మంత్రిగా సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 11 గంటలకు ఆయా శాఖల అధికారులకు సమాచారం అందిచారు. 

సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత కూడా అధికారులు హాజరుకాలేదు. వస్తారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చూసి చూసి నిరాశతో వెల్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. మెుత్తానికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అధికారులు హ్యాండివ్వడంతో చేసేది లేక వెళ్లిపోయారు. 

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సమీక్షలపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాదు అప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలో పాల్గొన్న అధికారుల వివరాలను సైతం సేకరించిది. సమీక్షలు చేయోద్దంటూ సిఈవో గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. 

అంతేకాదు ఎన్నికల కోడ్ కు సంబంధించి పలు పత్రాలను సైతం పంపిణీ చేశారు. దీంతో హోంశాఖపై సమీక్ష చేస్తున్న చంద్రబాబు నాయుడు సమీక్షను మధ్యలోనే వదిలేసిన పరిస్థితి నెలకొంది. సమీక్షలకు ఈసీ అభ్యంతరం వ్యక్తం చెయ్యడంపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దుమారం రేపింది. సిఈవో, సీఎస్ లపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. 

సమీక్షకు అధికారులు గైర్హాజరుకావడంతో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొబ్బరి బొండం నీళ్లు తాగి హడావిడిగా వెళ్లిపోయారు. సోమిరెడ్డి సమీక్షకు అధికారులు హాజరుకాకపోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇటీవలే తాను చేపట్టే సమీక్షను అడ్డుకుంటే మంత్రి పదవిని వదులుకుంటా, అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తానంటూ సవాల్ చేశారు. ఆయన సమీక్ష ఎలాగూ జరగలేదు ఈ నేపథ్యంలో ఆయన మంత్రి పదవిని వదిలేస్తారా లేక న్యాయ స్థానాలను ఆశ్రయిస్తారా ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది.