ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టయి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు వచ్చిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ అనుమతి నిరాకరించారు.

దీంతో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అచ్చెన్నాయుడికి ఇటీవలే శస్త్రచికిత్స జరిగిందని టీడీపీ అధినేత అన్నారు. శుక్రవారం పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని... 35 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం అచ్చెన్నాయుడి కుటుంబం ఎంతగానో కష్టపడిందని చంద్రబాబు గుర్తుచేశారు.

ఇలాంటి దుర్మార్గాలు సమాజానికి మంచిది కాదని.. ప్రభుత్వ అవినీతిపై శాసనసభలో నిలదీస్తారనే భయంతోనే అరెస్టులు చేస్తున్నారని ప్రతిపక్షనేత ఆరోపించారు. తప్పుడు రికార్డులు సృష్టించి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని.. ఇటీవల పైల్స్ ఆపరేషన్ చేయించుకున్న ఆయనను కొన్ని గంటల పాటు కూర్చోబెట్టి ప్రయాణం చేయించారని చంద్రబాబు మండిపడ్డారు.