రాష్ట్ర విద్యారంగ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ మళ్లా విజయప్రసాద్ ను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. 

విశాఖపట్నం: అధికార వైసిపి పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. తమ రాష్ట్రంలో విజయప్రసాద్ పై కేసు నమోదవడంతో విచారణలో భాగంగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ఒడిశా పోలీసులు తెలిపారు. 

ఆర్థిక నేరాలకు సంబంధించి 2019లో మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్‌పై ఒడిశాలో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ కోసమే విజయప్రసాద్‌ను ఒడిశా సీఐడీ, నేరవిభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో ఆయనను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనంతరం విజయప్రసాద్‌ను విశాఖ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌ అనుమతితో విజయప్రసాద్‌ను ఒడిశా తీసుకెళ్లారు. 

read more ఎమ్మెల్యే కన్నబాబుకి టోకరా: నకిలీ పత్రాలతో భూమి విక్రయించిన ఇద్దరి అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్ ''వెల్ఫేర్'' సంస్థ పేరిట చిట్ ఫండ్ వ్యాపారంతో పాటు రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. ఈ సంస్థ కార్యకలాపాలు కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ వున్నాయి. అయితే ఒడిశాలో ఈ సంస్థ డిపాజిటర్లకు సక్రమంగా చెల్లింపులు జరపకపోవడంతో ఫిర్యాదులు అందాయి. దీంతో వెల్ఫేర్ సంస్థ నిర్వహకులయిన మళ్లపై రెండేళ్ల క్రితమే కేసు నమోదయ్యింది. అందులో భాగంగానే ఇవాళ ఆయనను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇటీవలే వైసిపి ప్రభుత్వం విజయప్రసాద్ ను రాష్ట్ర విద్యారంగ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమించింది. గత నెల ఆగస్ట్ చివర్లో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మ‌ళ్ల బాధ్య‌త‌లు కూడా స్వీక‌రించారు.