హైదరాబాద్‌ : ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ కేసుకు సంబంధించి విచారణపై సీబీఐ యూటర్న్ తీసుకుంది. గతంలో ఓబులాపురం మైనింగ్ కేసు విచారణనను విశాఖపట్నం సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మెమో దాఖలు చేసిన సీబీఐ తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 

ఓబులాపురం మైనింగ్ సంబంధించి కుట్ర అంతా హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందని అందువల్ల తుది విచారణ ఇక్కడే చేపట్టాలని ప్రత్యేక కోర్టు విజ్ఞప్తి చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులు, ప్రైవేట్‌ వ్యక్తులు నేరం జరిగిన సమయంలో హైదరాబాద్‌లోనే నివసించినట్లు తన మెమోలో స్పష్టం చేసింది. 

ప్రస్తుత తరుణంలో ఈ కేసును విశాఖపట్నం సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తే ట్రయల్స్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సీబీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశానికి సంబంధించి సీబీఐ స్పెషల్‌ పీపీ బి.ప్రవీణ్‌రాజ్‌మెమో దాఖలు చేశారు. 

ఓఎంసీ కంపెనీకి మైనింగ్‌ అనుమతులకు సంబంధించిన వ్యవహారాలన్నీ హైదరాబాద్‌లోని సచివాలయం కేంద్రంగానే జరిగాయని మెమోలో తెలిపారు. ఓఎంసీకి అనుమతులు మంజూరు చేసిన అధికారుల్లో అత్యధికులు హైదరాబాద్ లోనే విధులు నిర్వహించినట్లు సీబీఐ కోర్టుకు తెలిపారు.  

రాష్ట్ర విభజనకు ముందే ఈ కేసులో దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు తెలిపారు. ఏపీకి సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టిన కేసులను మాత్రమే ఏపీకీ బదిలీ చేయాలని పునర్విభజన చట్టంలోని సెక్షన్ 105 చెప్తోందని సీబీఐ కోర్టుకు వివరించారు. 

ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి కొంతవ్యవహారం ఏపీలో జరిగిందన్న కారణంగా విశాఖ కోర్టుకు బదిలీ చేయడం ఏమాత్రం సబబు కాదని సీబీఐ స్పెషల్ పీపీ బి.ప్రవీణ్ రాజ్ స్పష్టం చేశారు. 

రాయలసీమ జిల్లాలకు సంబంధించిన కేసులను విశాఖ సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని హైకోర్టు లేఖ రాసిన నేపథ్యంలో ఓఎంసీ కేసు విశాఖపట్నం సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని ఈనెల 1న మెమో ద్వారా కోరినట్లు తెలిపారు. 

ఈ కేసును లోతుగా పరిశీలించామని, కుట్ర హైదరాబాద్‌ కేంద్రంగా జరగడం, అందులో భాగస్వాములుగా ఉన్న అధికారులు ఆ సమయంలో హైదరాబాద్‌లో విధులు నిర్వహించిన నేపథ్యంలో తుది విచారణ ఇక్కడే జరగాలని నివేదికలో స్పందించారు. 

సహజ వనరుల దోపిడీకి సంబంధించిన కేసుల్లో వనరులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నంత మాత్రాన కేసును ఆ రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని, కుట్ర జరిగిన ప్రాంతంలోనే తుది విచారణ జరగాలంటూ పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సీబీఐ మెమోలో పొందుపరిచింది. ఈ మెమోను పరిశీలించిన న్యాయమూర్తి బీఆర్‌. మధుసూదన్‌రావు తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేశారు.
 
ఇకపోతే ఓఎంసీ కేసును విశాఖ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ సీబీఐ అక్టోబర్1న మెమో దాఖలు చేసింది. ఈ విచారణకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వెంటనే తుది విచారణ ప్రారంభించాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌రెడ్డి, ఓఎంసీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, అలీఖాన్‌, మైనింగ్‌శాఖ మాజీ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేసు బదిలీని అప్పటి మైనింగ్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీనియర్‌ ఐఏఎస్‌ వై.శ్రీలక్ష్మి, మాజీ ఐఏఎస్‌ కృపానందం మాత్రం వ్యతిరేకించారు. 


 
మరోవైపు ఓఎంసీ కేసులో బెయిల్ కోసం ముడుపులు చెల్లించి అడ్డంగా దొరికిపోయిన నేపథ్యంలో కేసును విశాఖపట్నం స్పెషల్ కోర్టుకు బదిలీ చేయాలని సీబీఐ కోరిన వెంటనే గాలి అంగీకకరించడంతో సీబీఐకి అనుమానం వచ్చినట్లు తెలుస్తోంది.