విజయవాడ: తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడి, స్వయంగా ఓ పార్టీని ఏర్పాటుచేయడమే కాదు కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎన్టీఆర్. ఇలా రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించిన దివంగత నేతకు సొంత జిల్లాలోనే ఘోర అవమానం జరిగింది. ఆయన విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు దాడిచేసి ద్వంసం చేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

జిల్లాలోని ఆగిరిపల్లి మండలం ఈదులగూడెం గ్రామంలో ఏర్పాటుచేసిన మాజీ సీఎం ఎన్టీఆర్‌ విగ్రహం పాక్షికంగా ధ్వంసమయ్యింది. అర్థరాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు, పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ విగ్రహ ధ్వంసంపై టీడీపీ గ్రామ అధ్యక్షుడు కొండసాని సీతారామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఆకతాయిల పని కాదని ఉద్దేశపూర్వకంగానే విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. విగ్రహాలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని... అరాచక పాలనకు వరుస ఘటనలే నిదర్శనమన్నారు. వెంటనే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులకు గుర్తించి అరెస్ట్ చేయాలని సీతారామయ్య డిమాండ్ చేశారు.