తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు జయంతి సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఒంగోలులోని అద్దెంకి బస్టాండ్ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు జయంతి సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఒంగోలులోని అద్దెంకి బస్టాండ్ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ప్రస్తుతం.. మహానాడు జరుగుతున్న ఒంగోలు ఉన్న చంద్రబాబు.. తాను బస చేసిన చోటు నుంచి భారీ ర్యాలీతో అద్దెంకి బస్టాండ్ సెంటర్‌కు చేరుకున్న చంద్రబాబు.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను చంద్రబాబు కట్ చేశారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. పేదల సంక్షేమం కోసం పాటుపడిన మహావ్యక్తి అని కొనియాడారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు పేర్కొన్నారు.
జనాలు రావాలని అనుకుంటున్న మహానాడుకు ప్రభుత్వం బస్సులు ఇవ్వడం లేదని వైసీపీ సర్కార్‌పై చంద్రబాబు మండిపడ్డారు. ఎవరూలేని యాత్రకు మాత్రం ఏసీ బస్సులు తిప్పుతుందని ఎద్దేవా చేశారు. మహానాడుకు ఎవరూ రాకుండా అడ్డుకునేందుకు బస్సులకు అనుమతి ఇవ్వలేదన్నారు. తప్పుడు రాజకీయాలకు ప్రజలు ఆమోదించరని జగన్ తెలుసుకోవాలన్నారు. తమకు జనాలు ఉన్నారని.. వాళ్లకు బస్సులు ఉన్నాయని కామెంట్ చేశారు.
ఇక, ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ఆయనను స్మరించుకున్నారు. ‘‘ఎన్టీఆర్ చరిత్రను చూస్తే ఒక మనిషి తన జీవితంలో ఇన్ని సాధించగలడా అని ఆశ్చర్యం వేస్తుంది. ఎన్టీఆర్ గారిని సినీ రంగంలో వెండితెర వేలుపుగా, రాజకీయ రంగంలో పేదలపాలిటి దేవుడిగా కొలిచారు ప్రజలు. రెండు రంగాలలోనూ దైవత్వాన్ని కనబరిచిన అరుదైన చరిత్ర ఎన్టీఆర్ గారి సొంతం. దేశ రాజకీయాలలో సంక్షేమ శకానికి నాంది పలికి, సమ సమాజానికి బీజం వేసిన మహానుభావుడు ఎన్టీఆర్. ముఖ్యంగా తెలుగు జాతికి ఆ మహానుభావుడు చేసిన సేవలు చిరస్మరణీయం. అందుకు నివాళిగా సంవత్సర కాలం పాటు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను జరుపుకోవడానికి సంకల్పించాం. తెలుగు గడ్డపై తరతరాలు ఎన్టీఆర్ గురించి చెప్పుకునేలా, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరగాలి. ఈరోజు ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా ఆ ధన్య చరితుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
