ఎన్నారై టెక్కీ ఇండియాకు వచ్చి యువతులతో క్రీడ: ఐదో పెళ్లికి సిద్ధపడి....
ఐదో పెళ్లికి సిద్ధపడిన ఎన్నారై సాఫ్ట్ వేర్ ఇంజనీరు బాగోతం గుంటూరులో వెలుగు చూసింది. నాలుగో భార్య ఫిర్యాదుతో అసలు విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం అతను అమెరికాలో ఉన్నాడు.
గుంటూరు: అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గు పనిచేస్తున్న ఓ వ్యక్తి యువతులకు వల వేసి పెళ్లిళ్ల క్రీడ సాగించి తిరిగి వెళ్లిపోవడం అలవాటు చేసుకున్నాడు. ప్రతి శీతాకాలంలో భారత్ వచ్చి పెళ్లి చేసుకుని రెండు, మూడు నెలలు సంసారం సాగించి వదిలేసి వెళ్లిపోతుంటాడు. ఐదో పెళ్లికి సిద్ధపడిన ఆ టెక్కీ లీలలు బయటపడ్డాయి. అయితే, ఐదో పెళ్లి విషయం బయటకు రావడంతో అతను తప్పించుకుని అమెరికా వెళ్లిపోయాడు.
తల్లిదండ్రులు లేని యువతులను లేదా తల్లీ గానీ తండ్రి గానీ లేని యువతులను లక్ష్యంగా చేసుకుని అతను పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటాడు. ఇలా అతను నలుగురిని పెళ్లి చేసుకుని మోసం చేశాడు. ఐదో పెళ్లికి సిద్ధపడ్డాడు. అతనికి తల్లిదండ్రులతో పాటు ఏ మధ్యవర్థి కూడా సహకరిస్తూ వస్తున్నారు.
అతనేం చిన్న పిల్లాడో, యువకుడో కాదు, అతనికి నిండా 45 ఏళ్లు. 20 ఏళ్ల యువతులను పెళ్లి చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటూ వస్తున్నాడు. అతని వల్ల మోసపోయిన పాత గుంటూరుకు చెందిన నాలుగో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో ఆమె గుంటూరు అర్బన్ ఎస్పీని ఆశ్రయించారు. దాంతో కర్నాటి సతీష్ బాబు అలియాస్ శ్రీసత్యదేవ్ నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం వెలుగు చూసింది.
అతను గుంటూరు జిల్లా క్రోసూరు మండలం అందుకూరుకు చెందిన కర్నాటి వీరభద్ర రావు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు. అతను అమెరికాలో 13 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. మొదట శైలజ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. విశాఖపట్నానికి చెందిన ఆమెకు 12 ఏళ్ల కూతురు ఉంది. ఆ తర్వాత శైలజ బంధువు లావణ్యతో పరిచయం పెంచుకుని 2014లో అమెరికా తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకున్నాడు.
దానిపై మొదటి భార్య శైలజ హైదరాబాదులో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత లావణ్యను వదిలేసి 2017లో నరసరారావు పరిధిలో గల అన్నవరానికి చెందిన లక్ష్మి అనే యువతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడు నెలలు ఆమెతో గడిపి అమెరికా వెళ్లిపోయాడు. దానిపై లక్ష్మి గుంటూరులోని దిశ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి పాస్ పోర్టు సీజ్ చేశారు.
వారితో రాజీ చేసుకుని తిరిగి పాస్ పోర్టు సిద్ధం చేసుకుని పాత గుంటూరుకు చెందిన మరో యువతిని నాలుగో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కడే అమెరికా వెళ్లిపోయాడు. దాంతో అనుమానం వచ్చి ఆమె బంధువులు ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ కు వెళ్లారు. ఆ సమయంలో అతని లీలలు బయటపడ్డాయి. దాంతో నాలుగో భార్య నిరుడు ఫిబ్రవరి 24వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 26వ తేదీన కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సతీష్ బాబు తల్లిదండ్రులు వీరభద్రరావును, విజయలక్ష్మిని, మధ్యవర్తి చింతాడ బ్రహ్మానందరావులను దిశ పోలీస్ స్టోషన్ కు ఏప్రిల్ లో పిలిపించారు. ఐదు నెలలుగా ఏ విధమైన చర్యలూ తీసుకోలేదు.
ఈ స్థితిలో సతీష్ బాబు గత డిసెంబర్ లో భార్త వచ్చి తల్లిదండ్రులను కలిసి విజయవాడకు చెందిన యువతితో ఐదో పెళ్లికి సిద్ధపడ్డాడు. ముహూర్తాలు పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం సతీష్ బాబు నాలుగో భార్యకు తెలిసింది. ఆమె ఐదో పెళ్లికి సిద్ధపడిన యువతి కుటుంబ సభ్యులకు చెప్పింది. వాళ్లు పెళ్లి రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సతీష్ బాబు అమెరికా వెళ్లిపోయాడు. సతీష్ బాబును ఇండియాకు రప్పించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.