విజయవాడ: ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ శాఖకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం వంద ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మిషన్లను విరాళంగా అందజేసింది. కరోనా నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఈ మిషన్లను అందుకున్నారు. 

ఈ సందర్భంగా డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... ఉత్తర అమెరికా తెలుగు సంఘం  ఆక్సిజన్ మిషన్లు అందించడం‌ అభినందనీయమన్నారు. 13జిల్లాల్లో బ్లడ్ బ్యాంకు లలో  ఆక్సిజన్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేశామని... ఆక్సిజన్ అవసరం అయిన వారు 18004251234 కి ఫోన్ చేయాలని సూచించారు. ఫోన్ చేసిన వెంటనే తమ వాళ్లు స్పందించి అవసరమైన ఏర్పాట్లు చేస్తారన్నారు. రెడ్ క్రాస్ తరపున సేవలను మరింత విస్తృతం చేస్తున్నామని శ్రీధర్ రెడ్డి తెలిపారు.

కరోనా నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ...  ఆక్సిజన్ సకాలంలో అందక చనిపోయిన ఘటనలు అనేకం‌ చూశామన్నారు. కరోనా రోగుల కోసం ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసిందన్నారు. అయినప్పటికి  దయనీయ స్థితి చూసి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. ప్రాణ వాయివుని దానం చేసి ప్రాణాలు నిలబెడుతున్నారన్నారు. 

''తానా సభ్యులు కూడా స్పందించి ముందుకు రావడం సంతోషం. అంబులెన్స్ లు ఇచ్చేందుకు కూడా చాలా మంది దాతలు వస్తున్నారు. థర్డ్ వేవ్ ను కూడా తట్టుకునేలా ఇప్పటి నుంచే అందరూ అవసరం అయిన జాగ్రత్తలు చేపట్టాలి'' అన్నారు. 

''ఇప్పటికే ప్రభుత్వ పరంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సిఎం ఆదేశాల‌ ప్రకారం ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేస్తున్నాం. కోవిడ్  నియంత్రణ చర్యలలో ఎపి దేశంలోనే  ఆదర్శంగా నిలిచింది'' అన్నారు డాక్టర్  ఆర్జా శ్రీకాంత్