ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు సీబీఐ విచారణకుఉండవల్లి పిటిషన్: వేరే బెంచ్ కు బదిలీ చేయాలని జడ్జి ఆదేశం
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిల్ ను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని హైకోర్టు బెంచ్ రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ నెల 22న ఏపీ హైకోర్టులో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ దాఖలు చేశారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీఐడీతో కాకుండా సీబీఐతో విచారించాలని ఆయన ఆ పిల్ లో కోరారు. ఇవాళ ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.అయితే ఈ పిటిషన్ పై జస్టిస్ రఘునందన్ రావు జడ్జి ముందుకు వచ్చింది. అయితే ఈ పిటిషన్ ను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని జడ్జి రఘునందన్ రావు చెప్పారు. నాట్ బిఫోర్ మీ అంటూ జడ్జి తెలిపారు. అయితే ఈ పిటిషన్ ను ఏ బెంచ్ విచారించాలనే దానిని హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయించనుంది. ఇవాళ కానీ, రేపు కానీ ఈ విషయమై స్పష్టత రానుంది.
ఈ స్కాంలో అంతరాష్ట్ర సమస్యలున్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఇది తీవ్రమైన ఆర్ధిక నేరంగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ పిటిషన్ లో అభిప్రాయపడ్డారు. దీన్ని సీబీఐతో విచారించాలని కోరారు.ఈ కేసును ఈడీ విచారిస్తున్న విషయాన్ని కూడ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ పిటిషన్ లో ప్రస్తావించారు.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ టీడీపీ చీఫ్ చంద్రబాబును ఈ నెల 9వ తేదీన అరెస్ట్ చేసింది.ఈ కేసులో ఆయన రాజమండ్రి జైలులో ఉన్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు చంద్రబాబు జ్యూడిషీయల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. అయితే రాజకీయ దురుద్దేశ్యంతోనే తనపై ఈ కేసును బనాయించారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ కేసును సీబీఐతో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం మంచిదని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
also read:అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
ఇదిలా ఉంటే ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై టీడీపీ నేతలు ఆయనపై విమర్శలు చేస్తున్నారు.మొత్తం 44 మందిని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రతివాదులుగా చేర్చారు.ఇదిలా ఉంటే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ తో పాటు రిమాండ్ ను కూడ రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.