కరోనా మహమ్మారికి విరుగుడుగా అంటూ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య మందు కోసం జనం పోటెత్తిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆనందయ్య ఆయుర్వేద మందు వాడటం వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. ఆయుష్‌ విభాగం చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ విషయం తేలినట్లు సింఘాల్ వెల్లడించారు.

అయితే ఈ మందు తయారీ విధానంపై సమగ్ర అధ్యయనం చేపట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వానికి అందజేస్తామని హెల్త్ సెక్రటరీ పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతిచ్చాకే ఈ మందు పంపిణీ జరుగుతుందని, అంతవరకు ప్రజలు దీనిని వాడకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ మందుపై అధ్యయనానికి ఐసీఎంఆర్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందాన్ని పంపాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

Also Read:ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్య అరెస్ట్ అంటూ కథనాలు: నెల్లూరు జిల్లా ఎస్పీ క్లారిటీ

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐసీఎంఆర్, ఆయుష్ బృందాలు కృష్ణపట్నం చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయుష్ కమీషనర్ మాట్లాడుతూ... శాస్త్రీయంగా బొనిగి ఆనందయ్య మందుని అన్ని విధాలుగా పరిశీలిస్తామన్నారు. మందుకి చట్టబద్ధత కల్పిసే ఎక్కువ మందికి మందు కల్పించే అవకాశం ఉందన్నారు. నివేదికని త్వరితగతిన పంపడం జరుగుతుందన్నారు. రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయని ఆయుష్ కమిషనర్ వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో చికిత్స కూడా కష్టంగా మారింది. ఆక్సిజన్‌ అందక అనేకమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఇస్తున్న ‘కృష్ణపట్నం ఆయుర్వేద మందు’ కరోనాకు బాగా పనిచేస్తోందనే ప్రచారం జరిగింది. దీంతో వేల సంఖ్యలో జనం ఇక్కడకు తరలివస్తున్నారు. అయితే శాస్త్రీయంగా రుజువు కాలేదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీని నిలుపుదల చేసింది. పరీక్షల నిమిత్తం మందు శాంపిల్స్‌ను ఆయుష్‌ ల్యాబ్‌కు పంపింది.