అమరావతి: ఏపీ విభజన చట్టం హామీలను కేంద్రం తుంగలో తొక్కుతోంది. అమరావతి రైల్వేలైన్ విషయంలో ఏపీ ప్రభుత్వం ఆసక్తిగా లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో అమరావతి రైల్వేలైన్‌‌ ప్రాజెక్టుపై ఇన్నాళ్లు ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజలకు నిరాశే మిగిలింది. 

అమరావతి రైల్వేలైన్‌ ఖర్చు పంచుకోవడానికి కూడా ఏపీ సిద్ధంగా లేదని కేంద్రం స్పష్టం చేసింది.  మరోవైపు తెలంగాణలోనూ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అనవసరమని కేంద్రం తేల్చింది. 

ఈ ప్రకటనలతో విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలోతొక్కింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్న అంశాలను కేంద్రం పక్కన పెట్టిందనే విమర్శలు కూడ నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎక్కడా రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ అవసరంలేదని రైల్వేశాఖ తేల్చిచెప్పింది.

అమరావతికి రైల్వే ప్రాజెక్టును ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 28 కిలోమీటర్ల సింగిల్‌ లైన్‌ను ప్రతిపాదించారు. కృష్ణాజిల్లా పెద్దాపురం మీదుగా చిన్నారావు పాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పవరం, నంబూరుల వరకు ఈ మార్గాన్ని ప్రతిపాదించారు. 

అమరావతి నుంచి తిరిగి పెదకూరపాడు వరకు 25 కిలోమీటర్లు, సత్తెనపల్లి నుంచి నరసారావుపేట వరకు 25 కిలోమీటర్లు సింగిల్‌ లైన్లకు కూడా అప్పట్లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. 

ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు వచ్చిన వార్తలపై ఏపీలో నిరసనలు సాగుతున్నాయి.ఈ తరుణంలో అమరావతి రైల్వే లైన్ విషయంలో కూడ కేంద్రం వెనక్కు తగ్గడంతో ఏపీ వాసులు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.