అమరావతి: తాము అధికారంలో ఉన్నప్పుడు కేంద్రప్రభుత్వంతో పోరాడామంటే రాష్ట్రప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే అని చంద్రబాబు నాయుడు తెలిపారు. తనకు ప్రధాని మోడీకి వ్యక్తిగతంగా ఎలాంటి విరోధం లేదని స్పష్టం చేసారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 

రాష్ట్ర అభివృద్ధి కోసం తాము ఎంతో కృషి చేస్తే, జగన్ అధికారంలోకి రాగానే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం ఏర్పడిందంన్నారు. అద్భుతంగా తాము అమరావతి నిర్మాణాన్ని ప్రారంభిస్తే, జగన్ అమరావతిని ముంచేసాడని విమర్శించాడు చంద్రబాబు. 

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసమర్థత వల్ల రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగిందని దుయ్యబట్టారు. నదుల అనుసంధానం గురించి మాట్లాడుతూ, నదుల అనుసంధానం అనేది ఇద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించిన విషయం కాదని, రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం అని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి గురించి మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. అభివృద్ధి ఆగిపోయిందన్నారు. తాము అధికారంలోఉన్న 5ఏళ్లలో ఎప్పుడైనా విద్యుత్ సమస్య వచ్చిందా అని ప్రశ్నించారు చంద్రబాబు. గతంలోకన్నా, ఇప్పుడు ఎక్కువధర వెచ్చించి విద్యుత్ కొనుగోలుచేస్తున్నారని, ఈ విషయాలపై ప్రజల్లో చైతన్యం రావాలని అన్నారు.