ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ ఆర్ సీపీ ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. 2024లో కూడా సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపడుతారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపును అడ్డుకునే శక్తి ఆంధ్రప్రదేశ్ లో ఎవరికీ లేదని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గుడివాడలోని ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొడాలి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
2024 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి తిరిగి సీఎం అవడం ఖాయమని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా, దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు సీఎం జగన్ కు ఉన్నాయని అన్నారు. వైఎస్ఆర్ సీపీ పెట్టిన తరువాత జరిగిన ప్రతీ ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీ వచ్చిందని అన్నారు. ప్రతీ ఎన్నికల్లో సీఎం జగన్ సత్తా చాటుకున్నారని కొనియాడారు.
14ఏళ్ల పాటు ఒడుదుడుకులు ఎదురకున్న సీఎం జగన్ నేడు రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా నిలిచారన్నారు.వైసిపి ఎదుర్కొనే మూడో ఎన్నికలో జగన్ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరని ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు.
