' అత్తింటి వేధింపులే కారణం':శ్వేతను వేధించలేదన్న భర్త మణికంఠ
శ్వేతను వేధించలేదని భర్త మణికంఠ తెలిపారు. నిన్న తనతో ఫోన్ మాట్లాడుతూనే శ్వేత ఫోన్ కట్ చేసిందని మణికంఠ చెప్పారు.
విశాఖపట్టణం:తన భార్యను వేధించలేదని శ్వేత భర్త మణికంఠ చెప్పారు. బుధవారంనాడు విశాఖపట్టణం ఆర్ కే బీచ్ లో శ్వేత మృతదేహం దొరొకింది. శ్వేత రాసినట్టుగా ఉన్న సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న సాయంత్రం తాను తన భార్యతో ఫోన్ లో మాట్లాడినట్టుగా భర్త మణికంఠ చెప్పారు. తాను ఫోన్ మాట్లాడుతున్న సమయంలోనే తనతో గొడవపడిందన్నారు.
ఈ విషయమై ఆమెకు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే ఫోన్ కట్ చేసిందని మణికంఠ చెప్పారు. బుధవారం నాడు విశాఖపట్టణం పోలీస్ స్టేషన్ వద్ద మణికంఠ మీడియాతో మాట్లాడారు. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలే తమ ఇంట్లో కూడా ఉన్నాయని మణికంఠ చెప్పారు. చిన్న చిన్న సమస్యలను సర్ధుకుపోవాలని తాను శ్వేతకు చెప్పినట్టుగా మణికంఠ చెప్పారు. కానీ తన మాటను శ్వేత వినలేదన్నారు.
also read:విశాఖ ఆర్‌కే బీచ్ లో యువతి డెడ్ బాడీ కలకలం: దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆత్మహత్య చేసుకొనే ముందు తన కడుపులో ఉన్న బిడ్డ గురించి శ్వేత ఆలోచించి ఉంటే బాగుండేదని మణికంఠ అభిప్రాయపడ్డారు. తన భార్య సూసైడ్ నోట్ ను తమ పేరేంట్స్ ఫోన్ లో తనకు పంపారన్నారు. నిన్న సాయంత్రమే తమ పేరేంట్స్, శ్వేత పేరేంట్స్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.
శ్వేత మృతదేహంపై గాయాలు లేవు: విశాఖ ఈస్ట్ ఏసీపీ వివేకానంద
విశాఖ ఆర్ కే బీచ్ లో లభ్యమైన శ్వేత మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని విశాఖ ఈస్ట్ ఏసీపీ వివేకానంద మీడియాకు చెప్పారు. శ్వేత ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా హత్య చేశారా అనే విషయం దర్యాప్తులో తేలుతుందని ఏసీపీ చెప్పారు. శ్వేత రాసిన సూసైడ్ నోట్ న్యూపోర్టు పోలీసుల వద్ద ఉందని ఆయన తెలిపారు.
అత్తింటివారే వేధించారు: శ్వేత తల్లి
తన కూతురు శ్వేత మృతికి అత్తింటివారే కారణమని తల్లి రమాదేవి ఆరోపించారు. గత ఏడాది ఏప్రిల్ మాసంలో శ్వేతకు వివాహం చేసినట్టుగా ఆమె చెప్పారు.పెళ్లైన నెల రోజుల వరకు శ్వేతను బాగానే చూసుకున్నారన్నారు. నెల రోజుల తర్వాత వేధింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. అత్తా, మామలు, భర్త, వేధించారని ఆమె ఆరోపించారు. ఈ విషయాలను చెప్పుకుని తన కూతురు బాధ పడేదని ఆమె చెప్పారు.