తిరుపతి: చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి చెందినట్టుగా మీడియాలో తప్పుడు వార్తలు రావడం పట్ల కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

మాజీ ఎంపీ శివప్రసాద్ చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు మరణించినట్టుగా కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కుటుంబసభ్యులు తీవ్రంగా ఖండించారు. శివప్రసాద్  మృతి చెందకుండా మృతి చెందినట్టుగా వార్తలు ప్రసారం చేయడంపై కుటుంబసభ్యులు మండిపడ్డారు.

మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతుండడంతో ఆయన అల్లుడు నరసింహప్రసాద్ స్పష్టత ఇచ్చారు. శివప్రసాద్ ఆరోగ్యంగానే ఉన్నాడని ఆయన ప్రకటించారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కోలుకొంటున్నారని ఆయన ప్రకటించారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మోద్దని కూడ ఆయన స్పష్టం చేశారు. 

ఐసీయూలో శివప్రసాద్ చికిత్స తీసుకొంటున్నాడని కుటుంబసభ్యులు చెప్పారు. కొంత కాలంగా శివప్రసాద్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.దీంతో చికిత్స కోసం చెన్నై అపోలోకు తరలించారు.

శుక్రవారం నాడు సాయంత్రం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్న శివప్రసాద్ ను పరామర్శించారు. శివప్రసాద్ కు ఆరోగ్య పరిస్థితి గురించి  చంద్రబాబు డాక్టర్లను అడిగి తెలసుకొన్నారు. మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కూడ శివప్రసాద్ ను పరామర్శించారు.