నో డౌట్... ఏపీలో కాబోయే మంత్రులు వీరే
ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు. ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. మరి చంద్రబాబు కేబినెట్ లో మంత్రులెవరు..? పవన్ కల్యాణ్, నారా లోకేశ్ కు కీలక పదవులు దక్కుతాయా...? సీనియర్లలో ఎంతమంది మంత్రులవుతారు..? జూనియర్లలో ఎందరికిి అవకాశముంటుంది..? ఈసారి మహిళా మంత్రులు ఎంత మంది ఉంటారు..?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బంపర్ మెజారిటీ దక్కడంతో టీడీపీ, జనసేన, బీజేపీ సంబరాల్లో మునిగిపోయాయి. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. ఇక, చంద్రబాబు కేబినెట్‌లో ఎవరెవరికి చోటు దక్కుతుందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో... ఆయన కేబినెట్‌లో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ చేరుతాయా..? అలా జరిగితే ఏ పార్టీ నుంచి ఎంతమందికి మంత్రి పదవులు దక్కుతాయి..? ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీడీపీలో ఎంతమందికి మంత్రి పదవులు వరించనున్నాయి...? పవన్ కల్యాణ్ ఏ పదవి చేపడతారు..? డిప్యూటీ సీఎం అవుతారా..? లేదా..? చంద్రబాబు తర్వాత టీడీపీలో కీలకమైన నారా లోకేశ్ మంత్రివర్గంలో ఉంటారా..? ఉంటే ఏ శాఖలు తీసుకుంటారు..? గతంలో మాదిరిగా ఐటీ శాఖ లోకేశ్‌కే ఇస్తారా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
యువత, మహిళలకు చోటు
అయితే, చంద్రబాబు ఈసారి క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి మొహమాటాలకూ పోకుండా మంచి ఇమేజ్ ఉన్న వారివైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి కేబినెట్‌లో యువతతో పాటు బలహీన వర్గాలకు పెద్దపీట వేసే అవకాశాలున్నట్లు సమాచారం. మహిళలకు కూడా ఈసారి మంత్రివర్గంలో మంచి ఛాన్స్ ఉందట. సీట్ల విషయంలోనే ఈసారి ఆ విషయం స్పష్టమైంది. కడపలో రెడ్డెప్పగారి మాధవీరెడ్డి, పుట్టపర్తిలో సింధూర రెడ్డి, పెనుకొండలో సవిత లాంటివారు తొలిసారి పోటీలోనే విజయాన్ని అందుకున్నారు. ఇక, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి శింగనమలలో బండారు శ్రావణిశ్రీ, సూళ్లూరుపేటలో నెలవల విజయశ్రీ, రంపచోడవరంలో శిరీషాదేవి, కురుపాంలో జగదీశ్వరి ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. బీసీలైన గళ్లా మాధవి, యనమల దివ్య, సవితలదీ చెప్పుకోదగ్గ విజయమే. వీరిలో ఒకరిద్దరికీ కేబినెట్‌లో అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అలాగే రెండోసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తంగిరాల సౌమ్య (నందిగామ), వంగలపూడి అనిత (పాయకరావుపేట)తో పాటు టీడీపీలో సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు (విజయనగరం) కూడా కేబినెట్‌లో ఉండే అవకాశం ఉంది.
సీనియర్లలో ఎవరు..?
టీడీపీలో మోస్ట్ ఇంపార్టెంట్, సీనియర్లయిన కింజరాపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కోండ్రు మురళీమోహన్, రంగారావు, కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణరాజు, పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, శ్రీరాం తాతయ్య, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, శ్రావణ్‌కుమార్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయనతో పాటు ఏలూరు సాంబశివరావు(పర్చూరు), బి.ఎన్.విజయ్‌కుమార్(సంతనూతలపాడు), డోలా బాల వీరాంజనేయస్వామి(కొండపి) పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. పెద్దారెడ్ల గడ్డ నెల్లూరు జిల్లా నుంచి పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కేబినేట్‌లో అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా నుంచి అమరనాథ్ రెడ్డితో పాటు అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి, కడప జిల్లా నుంచి సుధాకర్ యాదవ్, మాధవీరెడ్డి, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
మైనారిటీల్లో మంత్రి ఎవరంటే..?
ముస్లిం, మైనారిటీ వర్గాల నుంచి నంద్యాల ఎమ్మెల్యే ఎన్‌ఎండీ ఫరూక్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, మదనపల్లి ఎమ్మెల్య షాజహాన్ బాషాలలో ఒకరికి కచ్చితంగా మంత్రి అయ్యే అవకాశం ఉంది.