బీజేపీకి సంబంధం లేదు.. చంద్రబాబు అరెస్టుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
Amaravati: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు తీరును ఖండించిన మొదటి పార్టీ బీజేపీయేనని పురంధేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందన్న వాదనలను ఆమె కొట్టిపారేశారు. చంద్రబాబు నిర్బంధాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతలు ఖండించారనీ, అరెస్ట్ చేసిన విధానం తప్పని పురంధేశ్వరి పేర్కొన్నారు.
AP BJP president Daggubati Purandeswari: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు తీరును ఖండించిన మొదటి పార్టీ బీజేపీయేనని పురంధేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందన్న వాదనలను ఆమె కొట్టిపారేశారు. చంద్రబాబు నిర్బంధాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ నేతలు ఖండించారనీ, అరెస్ట్ చేసిన విధానం తప్పని పురంధేశ్వరి పేర్కొన్నారు. అలాగే, పొత్తుల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆమె స్పందించారు.
వివరాల్లోకెళ్తే.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టుతో, ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఉన్నారు. అయితే, ఆయన అరెస్టు కేంద్రం, రాష్ట్రంలోని అధికార పార్టీలైన బీజేపీ, వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తంవుందని ఆరోపణల మధ్య ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురందేశ్వరి స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు అరెస్టుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. చంద్రబాబు అరెస్టుపై మొదట స్పందించింది తామేననీ, ఆయన అరెస్టును సైతం ఖండించామని చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఆయన పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరైంది కాదనీ ఆమె అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు అరెస్టు వెనుకు కేంద్ర ప్రభుత్వం ఉందనే ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఇక రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసిన సంగతి తెలిసిందే. బాబును కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ పొత్తుల గురించి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ ను పెంచాయి. వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ (టీడీపీ)తో పొత్తు పెట్టుకోవాలని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ తెలిపారు. ఈ విషయంలో బీజేపీ కూడా సానుకూలంగా స్పందించి తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన.. పొత్తుల గురించి ప్రకటన చేయడం పై కూడా పురందేశ్వరి స్పందించారు. పవన్ వ్యాఖ్యల్లో పెద్దగా తప్పేమీ లేదని పేర్కొన్నారు. "పవన్ వ్యాఖ్యలను మేము తప్పుగా చూడటం లేదు. అందులో తప్పేమీ లేదు. దీని గురించి బీజేపీ అధిష్టానానికి అన్నీ వివరిస్తాను. ఈ సమయంలో మా అభిప్రాయం వెల్లడిస్తాం. జనసేన పార్టీ బీజేపీతో పొత్తులోనే ఉంది" అని తెలిపారు. అలాగే, చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనే ఆరోపణలను తామ పార్టీ అగ్రనాయకత్వం సైతం ఇప్పటికే ఖండించిందని తెలిపారు.