చంద్రబాబు కుప్పం టూర్ పై కొనసాగుతున్న ఉత్కంఠ: నోటీసులిచ్చిన పోలీసులు


టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటపై  ఉత్కంఠ నెలకొంది.  చంద్రబాబు రోడ్ షోలలో పాల్గొంటే  కేసులు నమోదు చేస్తామని  పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

no clarity on Chandrababu Naidu kuppam tour

కుప్పం: టీడీపీ చీఫ్  చంద్రబాబు నాయుడు  కుప్పం  పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది.  చంద్రబాబునాయుడు సభలకు, రోడ్ షో లకు  ఎలాంటి అనుమతి లేదని  కుప్పం పోలీసులు ప్రకటించారు.  ఈ మేరకు  పోలీసులు కుప్పం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలకు  నోటీసులు అందించారు. చంద్రబాబు సభల్లో పాల్గొంటే  కేసులు నమోదు చేస్తామని  పోలీసులు వార్నింగ్  ఇచ్చారు.దీంతో  చంద్రబాబునాయుడు పర్యటనపై  ఉత్కంఠ  నెలకొంది.

రాష్ట్రంలో రోడ్లపై సభలు, సమావేశాలను నిరసిస్తూ  జగన్ సర్కార్  ఈ నెల  2న  ఉత్తర్వులు జారీ చేసింది.   జాతీయ రహదారులతో  సహ, అన్ని రకాల రోడ్లపై  సభలు, 
సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించింది.  ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో సభలు నిర్వహించుకోవాలని  ఏపీ ప్రభుత్వం సూచించింది.  ప్రభుత్వ ఆదేశాలకు విరుద్దంగా  వ్యవహరిస్తే  చర్యలు తీసుకొంటామని  అధికారులు హెచ్చరించారు.  గత ఏడాది డిసెంబర్  28న కందుకూరులో నిర్వహించిన  చంద్రబాబు రోడ్ షో లో  ఎనిమిది మంది మృతి చెందారు.  ఈ నెల 1వ తేదీన గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కిట్  పంపిణీ కార్యక్రమం సందర్భంగా  తొక్కిసలాట  జరిగింది.  ఈ ఘటనలో  ముగ్గురు మృతి చెందారు. 

రోడ్లపై రోడ్ షోలు, సభలు, ర్యాలీల కారణంగా  ప్రమాదాల నివారణకు గాను  ఏపీ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసిందని  వైసీపీ నేతలు  చెబుతున్నారు. తమ పార్టీ సభలు, ర్యాలీలు నిర్వహించకుండా  అడ్డుకొనే క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసిందని  టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.  ఈ విషయమై కోర్టును ఆశ్రయిస్తామని ఆ పార్టీ  నేత బొండా ఉమామహేశ్వరరావు  ప్రకటించారు.రాష్ట్ర ప్రభుత్వం  తీసుకువచ్చిన కొత్త జీవో నేపథ్యంలో చంద్రబాబునాయుడు కుప్పం టూర్  సాగుతుందా లేదా  అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios