అమరావతి: నైరుతి మరియు దాని అనుసంధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం 24 గంటల్లో తుఫానుగా బలపడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. 

తుఫాను ప్రభావంతో రాగల 3 రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందన్నారు. మంగళవారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు...బుధ, గురువారం అక్కడక్కడ భారీ నుంచి  అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం వుందని హెచ్చరించారు. 

read more  బంగాళాఖాతంలో వాయుగుండం...రానున్న మూడురోజులు భారీ వర్షాలు

తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయి. సముద్రం అలజడిగా ఉంటుంది కాబట్టి మూడురోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదన్నారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.

వ్యవసాయ పనుల సమయంలో రైతాంగం అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు  జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల‌ నిర్వహణ శాఖ కె.కన్నబాబు సూచించారు.