ప్రధాని నరేంద్రమోడీని విమర్శించడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.  ఇవాళ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన గడ్కరీ విజయవాడలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గోని ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ ఐదేళ్లు స్వర్ణయుగమని, నాలుగున్నరేళ్లలో మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో చేసిందన్నారు.  పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి జీవనధారా అని ఈ ప్రాజెక్ట్‌కు నూరు శాతం నిధులు ఇస్తున్నామని గడ్కరీ తెలిపారు.

ఏపీలో పెద్ద ఎత్తున జాతీయ రహదారులను విస్తరించామన్నారు. రాజధాని అమరావతిని రాయలసీమ జిల్లాలకు అనుసంధానించేలా అమరావతి-అనంతపురం మధ్య రహదారిని నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రం నుంచి నిధులను పొందుతూ కూడా మోడీకి చంద్రబాబు సర్కార్ ఎలాంటి క్రెడిట్ ఇవ్వడం లేదని గడ్కరీ ఎద్దేవా చేశారు.

లక్షా 64 వేల కోట్లు పోర్టుల కోసం ఖర్చు చేశామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. పోర్ట్ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తామని ఆయన తెలిపారు. సాగరమాల ప్రాజెక్ట్‌లో ఏపీకి స్థానం కల్పించామని దీని వల్ల పోర్ట్‌లను జాతీయ రహదారులతో అనుసంధానిస్తామన్నారు.

రాష్ట్రంలో అప్పటికీ, ఇప్పటికీ సామాజిక, ఆర్ధిక పరిస్థితులు ఎంతో మారాయని గడ్కరీ వెల్లడించారు. గోదావరి మిగులు జలాలను తమిళనాడుకు అందిస్తామని, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి నదులను అనుసంధానిస్తామన్నారు. మోడీని విమర్శించే నేతలంతా స్వతంత్ర సంస్థతో సర్వే చేయిస్తే నిజాలు బయటపడతాయని గడ్కరీ అన్నారు.