ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు లంచాలు తీసుకోవడంలో ఆరితేరిపోయారట.. ఈ మాట మేం అనడం లేదు.. ఓ సర్వేలో తేలిన విషయం ఇది. ‘ఎలక్ట్రిసిటీ యాక్సెస్‌ ఇన్‌ ఇండియా: బెంచ్‌మార్కింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ యుటిలిటీస్‌’ పేరుతో కేంద్ర విద్యుత్ శాఖ, నీతి ఆయోగ్, రాక్ ఫెల్లర్ ఫౌండేషన్, స్మార్ట్ పవర్ ఇండియా సంయుక్తంగా 10 రాష్ట్రాల్లో సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో ఎక్కువగా లంచాలు తీసుకుంటున్న విద్యుత్ ఉద్యోగుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.

వినియోగదారుల నివేదిక ఆధారంగా సర్వే ఫలితాలు వెల్లడించారు. సర్వేలో దాదాపు 57శాతం మంది వినియోగదారులు పాల్గొనగా.. వారు తమకు ఎదురైన పరిస్థితిని సర్వేలో అధికారులకు వివరించారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించి, వాటికి పరిష్కార మార్గాలను ఈ నివేదిక సూచించింది

చేసిన పనికి మించి.. అదనంగా డబ్బులు ఇవ్వాలని విద్యుత్ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని వినియోగదారులు స్వయంగా వెల్లడించారు. వారిలో దేశవ్యాప్తంగా గృహ వినియోగదారుల్లో 33% మంది, సంస్థాగత వినియోగదారుల్లో 21% శాతం మంది ఉండటం గమనార్హం.

గుజరాత్‌లో అతి తక్కువగా 8 శాతం, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, దక్షిణ డిస్కంల పరిధిలో అత్యధికంగా 57 శాతంగా ఉండటం గమనార్హం. విద్యుత్తు సమస్యలు తెలుసుకోవడానికి 10 రాష్ట్రాల్లోని 25 డిస్కంల పరిధిలో 25,116 మందిని సర్వేచేశారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లో 1,809 మంది ఉన్నారు. ఈ అంశంపై వినియోగదారులను చైతన్య పరచడం, అదనపు మొత్తాలను అడిగే సిబ్బందిపై డిస్కింలు చర్యలు తీసుకోవాల్సి ఉందని నీతి ఆయోగ్‌ స్పష్టం చేసింది.