గుంటూరు: 2014 నుంచి 2019 ఏప్రిల్ 1 నాటికి అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 7.82 లక్షల గృహాలు పూర్తయ్యాయని అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ప్రభుత్వమే నివేదించిందని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఇలా వాస్తవాలు సాక్షాధారాలతో ఉంటే ఏ2 రెడ్డి మాత్రం ట్విట్టర్ లో గృహ నిర్మాణాలు పూర్తి కాలేదని వక్రీకరిస్తూ  ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

''మీ స్వస్థలమైన నెల్లూరు జిల్లా పెన్నానది ఒడ్డున వెంకటేశ్వరపురంలో గృహ ప్రవేశాలకు సిద్దంగా ఉన్న 4,800 గృహాలు ఏ-2 రెడ్డికి కళ్లకు కనపడం లేదా? అలాగే తాడేపల్లిలో మీ నాయకుడి రాజసౌధం వెనక ఉన్న అమరావతిలో  పేదల కోసం నిర్మించిన 5024 వేల ఇళ్లు మీ కళ్లకు కనబడలేదా..? మంత్రి... కంత్రీ... మధ్యలో ఇంతి గొడవలో తలమునకలై భయటి ప్రపంచం చూడలేదా?  లేక అల్లుడి 108 అంబులెన్స్ ల అవినీతి సంపాదనతో ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారా..?'' అంటూ విజయసాయిపై ఫైర్ అయ్యారు.

read more    పోలీసులకు ధీటుగా సమాధానం... టిడిపి కార్యకర్తను అభినందించిన చంద్రబాబు

''సెంటి ఇంటి స్థలం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 6వేల ఎకరాలను బలవంతంగా లాక్కొని రూ. 8వేల కోట్ల ప్రజాధనంలో సగానికి సంగం తినేస్తున్నారు. సెంటు భూమికి ఖర్చు చేస్తున్న రూ. 8 వేల కోట్లను బ్యాంక్ లింకేజ్ చేసుంటే 20 లక్షల పక్కా గృహాలు పూర్తై ఉండేవి. గృహ నిర్మాణంలో పెద్ద స్కాంకు అవకాశం లేదని సెంటు ఇంటి  స్థలం స్కీం పెట్టింది నిజం కాదా ఏ2 రెడ్డి గారు..? అవినీతి వాటాల పంపకంలో తేడాలొచ్చాయి కాబట్టి పట్టాల పంపిణీని 3 సార్లు వాయిదా వేసింది నిజం కాదా..?'' అని నిలదీశారు. 

''జగన్ రెడ్డి నిజంగా పేదల ఉద్దారకులైతే వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన పక్కా గృహాలు లబ్ధిదారులకు అందించాలి. అదే విధంగా టిడిపి ప్రభుత్వం మాదిరిగా పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల ఇళ్ల పట్టాలు పేదలకు మంజూరు చేయాలి'' అని చినరాజప్ప తెలిపారు.