జగన్‌రెడ్డి పాలనలో బీసీలు సంతోషంగా ఉన్నారనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు నిమ్మకాయల చినరాజప్ప. మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు. నిధులు, విధులు ఉన్న 720 నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా ఎలాంటి అధికారాలు లేని 56 కార్పొరేషన్లు బీసీలకు ఇచ్చారని రాజప్ప విమర్శించారు. 

రాష్ట్రంలో బలహీనవర్గాలకు జరుగుతున్న అన్యాయంపై వైసీపీ మంత్రులు నోరు మెదపడంలేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం కేసుల మాఫీ కోసం రైతుల ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టపెట్టారని టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప  మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులకు సంబంధించి పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు ఏకపక్షంగా మద్దతు తెలిపారని చెప్పారు. 

ఆనాడు సవరణలు కోరితే విజయసాయరెడ్డి, వైసీపీ నేతలు నిందలు వేశారని గుర్తుచేశారు. ఇవాళ జే-టర్న్ తీసుకుని కపట నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నాడు-నేడు పోరాడేది ఒక్క టీడీపీ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో వరుస ‘‘ప్రకృతి వైపరీత్యాలతో రైతు కుదేలు అయ్యాడు".  దెబ్బతిన్న అన్నదాత వెన్ను విరుస్తూ.. సాకులు చెబుతూ మద్దతు ధర ఇవ్వకుండా  అసమర్థ విధానాలతో భీమా ప్రీమియం చెల్లించకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా, పంటను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రాజప్ప ఘాటుగా విమర్శించారు. 

ఈ రోజు ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే  ఏలూరులో ప్రజలు అంతుపట్టని వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. ప్రభుత్వ అసమర్ధతతోనే ఏలూరులో వింత రోగం బారిన పడి అనేక  మంది ఆస్పత్రి పాలయ్యారని వారిని చూస్తేంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస పరిజ్ఞానం లేని మంత్రులు రాష్ట్రంలో ఉన్నారని మండిపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి వైద్యం అంటే తెలీదని ఎద్దేవా చేశారు. 

ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతోందన్నారు. ఓ పద్దతి ప్రకారం పారిశుద్ధ్యం నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాదని తెలిపారు.  ❝చేతకాని ప్రభుత్వం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వైకాపా ఎంతసేపు తెదేపా నేతలను దెబ్బతీయాలని చూస్తున్నారు తప్ప.. పాలనపై దృష్టి సారించడం లేదు. ఏలూరు ఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ప్రజలకు నమ్మకం కలిగించేలా ఆరోగ్య చర్యలు చేపట్టాలి’’ అని రాజప్ప  అన్నారు. ప్రభుత్వానికి అప్పులు చేయడంలో ఉన్న  శ్రద్ధ..ప్రజారోగ్యంపై లేదని విమర్శించారు. 

రాష్ట్రంలో తెదేపా హయాంలో బీసీలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు  ప్రణాళికాబద్ధంగా కృషి చేయడం జరిగింది. బీసీల అభ్యున్నతి కోసం తెదేపా ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేసింది. బీసీలు ఆర్ధికంగా, సామాజికంగా, ఉన్నత స్థాయికి ఎదిగేలా అనేక పధకాలు ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలోని బడుగులు సైతం ఇతర సామాజికవర్గాలకు తీసిపోని విధంగా భవిష్యత్ ను నిర్మించుకునేందుకు ఆనాడు తెదేపా ప్రభుత్వం అనేక  కార్యక్రమాలను చేపట్టింది.

ఈ రోజు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు నానాటికీ భగ్గుమంటున్నాయి. కష్టకాలంలో ధరలు పెంచి దోచేస్తున్న జగన్ రెడ్డి సర్కారు - స్కీముల కోసం సామాన్యుల నెత్తిన ట్యాక్స్ పిడుగు - సంపద సృష్టించడం మాని - అప్పులు చేస్తూ - సామాన్యుల పై భారం మోపుతున్న వైసిపి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని వైసిపి మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని  అభిప్రాయపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు సవరిస్తున్నట్లు ప్రకటించి వ్యాట్ పెంచారు. సగటున లీటర్ పెట్రోల్ డీజిల్ పై పెంచిన మొత్తంతే ప్రజలపై र 500 కోట్ల మేర భారం మోపారు. 

అడ్డగోలుగా విద్యుత్ స్లాబులు మార్చి రూ. 1500 కోట్ల భారాన్ని బలవంతంగా రాష్ట్ర ప్రజలపై రుద్దారు. ఆర్టీసీ ధరలు సగటున 20% పెంచారు. సామాన్యులపై రూ. 1,000 కోట్ల భారం మోపారు. టీడీపీ స్కీముల్ని రద్దు చేశారు, అన్నా క్యాంటిన్లను మూసేశారు. పండుగ కానుకులు రద్దు చేశారు, ముస్లింలకు రంజాన్ తోఫా ఎగ్గోట్టారు. గిరిజనులకు ఫుడ్ బాస్కెట్ తీసేశారు. పేదల పొట్టకొట్టి వైసిపి నేతల బొజ్జ నింపుతున్నారు అని రాజప్ప దుయ్యబట్టారు.