ఆంధ్రప్రదేశ్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం రోజుకో మలుపుతిరిగుతుంది. నిన్ననే.... న్యాయస్థానం తనను నియమించమని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తనను నియమించడంలేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా తనను కాపాడాలంటూ గవర్నర్ కి ఒక లేఖ రాసారు. 

తనకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భయోత్పాతం సృష్టిస్తోందని లేఖలో పేర్కొన్నారు నిమ్మగడ్డ. వెంటనే తమ జోక్యం అవసరమని.. తనను కాపాడాలని రమేష్ కుమార్ ఆ లేఖలో రాష్ట్ర గవర్నర్ ని కోరారు. హైదరాబాద్ ‌లోని తన ఇంటిపై 24 గంటలు నిఘా పెట్టారని లేఖలో తెలిపారు. ఒక కారు, రెండు  ద్విచక్రవాహనాలపై తనను ఫాలో చేస్తున్నారని రమేష్ కుమార్ తెలిపారు. 

న ఫోన్ ట్యాపింగ్‌లో ఉందని, ఈ ఏడాది మార్చి 18న తనకు రక్షణ కల్పించిన కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తాను లేఖ రాశనని....  ఈ లేఖపై కూడా అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారని, ఈ లేఖను తానే రాశానని చెప్పినప్పటికీ వినలేదని రమేష్ కుమార్ అన్నారు. 

అదే విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ధ్రువీకరించారని, ఈ లేఖపై స్పందించి తనకు కేంద్రం రక్షణ కూడా కల్పించిందన్నారు రమేష్ కుమార్. 

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు ఎన్నికల కమిషన్ కార్యాలయంలోకి వెళ్లి కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకోవడంతోపాటుగా, రహాస్య సమాచారాన్ని కూడా తీసుకెళ్లారని, లేఖను టైప్ చేసిన ఉద్యోగిని సైతం అదుపులోకి తీసుకున్నారని రమేష్ కుమార్ ఈ లేఖలో పేర్కొన్నారు. 

తాను కేంద్రానికి రాసిన లేఖ బయట తయారు చేసారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవంలేదని, తనను విజయవాడ, కార్యాలయానికి రానివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేసారు. కనీసం తన తల్లిని చూసేందుక్కూడా అవకాశం ఇవ్వడంలేదన్నారు. 

హైకోర్టు తనను పునర్నియమించాలని తీర్పును వెలువరించినప్పటికీ..... పాత కమిషనర్ కనగరాజ్‌కు ఇంకా ఎన్నికల కమిషనర్ సదుపాయాలను కల్పిస్తున్నారని రమేష్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఈ చర్యలన్నీ ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని, సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, ఇప్పటికైనా మీరు నన్ను తిరిగి హైకోర్టు ఆదేశాలనుసారం పునర్నియమించమని కోరుతున్నట్టుగా ఈ లేఖలో పేర్కొన్నారు రమేష్ కుమార్.