అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొర్రీ వేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను నిలిపేయాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి ఆయన ఓ లేఖ రాశారు. 

13 జిల్లాల ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చేపట్టామని, ఎన్నికలు పూర్తయ్యే వరకు 13 జిల్లాలే ఉండాలని రమేష్ కుమార్ అన్నారు. లేకపోతే జిల్లా పరిషత్తు ఎన్నికలకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎదురువుతాయని ఆయన అన్నారు. అందువల్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా జిల్లాలపై విధాన నిర్ణయం తీసుకోవద్దని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని, అది పూర్తయ్యే వరకు జిల్లాల పునర్విభజన చేయడం సరి కాదని ఆయన ఆ లేఖలో చెప్పారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలో ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. 

ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని, అదనంగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానిపై ప్రత్యేక కమిటీని వేసి వేసి అధ్యయనం చేయిస్తున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీసు యంత్రాంగం కూడా కొత్త జిల్లాలో ఏర్పాటుపై ప్రణాళిక వేసుకుంది. ఈ నేపథ్యంలో రమేష్ కుమార్ నీలం సాహ్నికి లేఖ రాశారు.