అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జారీ చేసిన ఉత్తర్వులో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులో జోష్ పెంచే అవకాశం ఉంది. టీడీపీ శిబిరంలో ఉత్సాహం పెరిగే అవకాశం ఉంది. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో అనుసరించిన వ్యూహం దెబ్బ తినడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆత్మరక్షణలో పడ్డారని చెప్పవచ్చు. రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి తమిళనాడుకు చెందిన మాజీ న్యాయమూర్తి కనగరాజ్ చేత ఎస్ఈసీగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈలోగా రమేష్ కుమార్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు వెలువరించడంతోనే జగన్ చిక్కుల్లో పడ్డారు. 

Also Read: వైఎస్ జగన్ కు షాక్: నిమ్మగడ్డ కొనసాగింపునకు గవర్నర్ ఆదేశాలు

కనగరాజ్ నియామకం చెల్లదని, రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా కొనసాగించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే, హైకోర్టు ఆదేశాలపై అమలుపై స్టే ఇవ్వడానికి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనివల్ల జగన్ వ్యూహానికి దెబ్బ తగిలింది. 

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు అనుకూలంగా మలుచుకున్నారు. హైకోర్టును ఆశ్రయించి తనను ఎస్ఈసీగా కొనసాగించడానికి అవసరమైన ఆదేశాలను తెచ్చుకున్నారు. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు గవర్నర్ ను కలిశారు. గవర్నర్ రాజ్యాంగ నిపుణులను సంప్రదించారు. గవర్నర్ నిమ్మగడ్డకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. 

Also Read: 40 నిమిషాలు భేటీ: గవర్నర్ చేతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భవిష్యత్తు

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే, జగన్ ప్రభుత్వం ఆ డిమాండ్ బేఖాతరు చేస్తూ వచ్చారు. రమేష్ కుమార్ ను అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం చివరి ప్రయత్నం కూడా చేసింది. కేసు విచారణలో ఉన్నందున హైకోర్టు ఆదేశాల అమలును నిలిపేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈలోగానే గవర్నర్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. 

తాజా పరిణామం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబుతో సహా వైఎస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ గొంతు పెంచే అవకాశం ఉంది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కోర్టుల్లో వీగిపోయిన విషయాలను తెర మీదికి తెస్తూ జగన్ ను ఆత్మరక్షణలో పడేసే అవకాశం ఉంది.