అమరావతి: గతంలో కేంద్ర హోం శాఖకు ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విజయసాయి రెడ్డికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.

కేంద్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసింది తానే అని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఆ మేరకు ఆయన  ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో తానే ఆ లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల కమిషనర్ గా తనకున్న అధికార పరిధిలోనే లేఖ రాసినట్లు చెప్పారు. 

 ఆ లేఖపై ఎవరికీ ఏ విధమైన సందేహాలు కూడా అవసరం లేదని ఆయన అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కూడా దాన్ని నిర్ధారించారని ఆయన చెప్పారు. దానిపై ఏ విధమైన ఆందోళన, సందేహాలు అవసరం లేదని రమేష్ కుమార్ అన్నారు. దానిపై ఏ విధమైన వివాదాలు, రాద్దాంతాలకు తావు లేదని అన్నారు.

రమేష్ కుమార్ రాసిన ఆ లేఖపై విచారణ జరిపించాలని కోరుతూ విజయసాయి రెడ్డి బుధవారం డీజీపీ గౌతం సవాంగ్ కు ఓ లేఖ రాశారు. ఆ లేఖ ఫోర్జరీ అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందని ఆయన వ్యాఖ్యానించారు.