చంద్రబాబు సిఎం అయిన దగ్గర నుండి ఇంత వరకూ చెప్పుకోతగ్గ పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు. పెట్టుబడుల ఆకర్షణకు కోట్ల రూపాయలు వ్యయం అవుతున్నాయే గానీ ఒక్క కోటి రూపాయలు కూడా పెట్టుబడిగా రాలేదు.
తన భుజాలు తానే చరుచుకోవటంలో చంద్రబాబును మించిన వారు లేరు. తాజాగా జరిగిన పార్టీ ఎంఎల్ఏ, ఎంపి, ఎంఎల్సీల వర్క్ షాపులో మరోసారి ఆ విషయం రుజువైంది. పార్టీ మీటింగే కాబట్టి చంద్రబాబు ఏమి చెప్పినా ఎదురే ఉండదు.
పార్టీ నేతలను మెచ్చుకుంటూనే, ప్రతిపక్షంపై మండిపడుతూనే, నోట్ల రద్దుపై సన్నాయినొక్కులు నొక్కుతూనే ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా చేయటం తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. ఆ తర్వాత మాట్లాడుతూ, ఈ సంవత్సరంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో ఏపినే నెంబర్ వన్ అట. ఎలా వచ్చిందో చెబితే బాగుంటుంది.
అలాగే, వ్యవసాయ, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో దేశంలో ఏపినే ముందుందని చెప్పారు. మొదటి ఆరు నెలల్లో వృద్ధి రేటు 12.23 శాతమట. జాతీయ వృద్ధి రేటుకన్నా 5 శాతం ఎక్కువన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 22 శాతం వృద్ధి రేటు సాశించినట్లు తెలిపారు. విద్యుత్, ఉపాధి హామీలో దేశం మొత్తం మీద ఏపినే ముందంజలో ఉందన్నారు. ఇవన్నీ వింటున్న నేతలు నిజమేనా ఆశ్చర్యపోతున్నారు.
బెస్ట్ స్టేట్ ఇన్ సన్ షైన్ డెవలప్ మెంట్ గా రాష్ట్రానికి అవార్డు దక్కిందన్నారు. బెస్ట్ సన్ షైన్ స్టేట్ గా ఎలా వచ్చిందో చంద్రబాబుకే తెలియాలి. చంద్రబాబు సిఎం అయిన దగ్గర నుండి ఇంత వరకూ చెప్పుకోతగ్గ పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు.
ఇక పెట్టుబడుల గురించి చెప్పనే అక్కర్లేదు. పెట్టుబడుల ఆకర్షణకు కోట్ల రూపాయలు వ్యయం అవుతున్నాయే గానీ ఒక్క కోటి రూపాయలు కూడా పెట్టుబడిగా రాలేదు. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వమే వెల్లడించింది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా జనచైతన్య యాత్రలు బాగా జరిగాయన్నారు. పొలిటీషియన్ అవ్వటం అంత సులభం కాదన్నారు. నిత్యం ప్రజల్లో లేకపోతే నేతలకు ఓటమి తప్పదన్నారు. అంతవరకూ బాగానే ఉంది. అయితే అందుకు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను ఉదాహరణగా చూపటం ఆశ్చర్యం.
చంద్రబాబు మరచిపోయిన విషయం ఓటుంది. అదేంటంటే, మన్మోహన్ ఎప్పుడూ రాజకీయ నేత కాదు. ప్రపంచం మెచ్చిన కొద్దిమంది ఆర్ధిక వేత్తల్లో ఒకరు. అవసరార్ధం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు మన్మోహన్ ను ఆర్ధికశాఖమంత్రిగా తీసుకున్నారు. కాబట్టి మన్మోహన్ లోక సభ ఎన్నికల్లో ఓడిపోవటంలో ఆశ్చర్యం ఏమీలేదు.
ఇక, రెండున్నర సంవత్సరాలు గడచినా కేంద్రం నుండి ఆశించిన మేలు ఏమీ జరగలేదని చెప్పటం గమనార్హం. అందుకే స్పెషల్ ప్యాకేజికి ఒప్పుకున్నట్లు అంగీకరించారు. కేవలం పోలవరం ప్యాకేజి కోసమే తాను ప్ర్యతేక ప్యాకేజికి అంగీకరించినట్లు చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు పనులు దక్కించుకునేందుకే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారనే కదా ప్రతిపక్షాలు కూడా చెబుతున్నది.
ఇక నోట్ల రద్దు గురించి మాట్లాడుతూ, ఆర్బిఐ కొద్ది కొద్దిగా డబ్బులు ఇస్తున్నట్లు చెప్పారు. కొత్త నోట్లు ఎప్పుడు వస్తాయో తెలీదన్నారు. 2 వేల నోటు వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్పారు. రోజుకు ఎన్నిగంటలు పనిచేసినా సమస్యకు పరిష్కారం దొరకటం లేదని వాపోయారు.
