Asianet News TeluguAsianet News Telugu

పేర్ని నాని అనుచరుడి హత్య కేసులో ట్విస్ట్: టీడీపీ నేత కొల్లు రవీంద్రపై కేసు

మోకా భాస్కర్ రావు హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హత్య కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారుపోలీసులు.  ఈ కేసులో కుట్రదారుగా కొల్లు రవీంద్రపై 109 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

New Twist In Perni Nani Follower Moka bhaskar rao Murder case: case registered against Ex TDP Minister Kollu Ravindra
Author
Machilipatnam, First Published Jul 3, 2020, 7:59 AM IST

మంత్రి పేర్ని నాని ప్రధాన అనుచరుడు, వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య రాజకీయ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ  వైసీపీ నేత హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. హత్య కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రపై కేసు నమోదు చేశారుపోలీసులు.  ఈ కేసులో కుట్రదారుగా కొల్లు రవీంద్రపై 109 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

మోకా భాస్కర రావు హత్య కేసులో కృష్ణా జిల్లా పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. మోకా భాస్కర రావును హత్య చేస్తే తర్వాత అంతా తాను చూసుకుంటానని కొల్లు రవీంద్ర అభయం ఇచ్చినట్టు నిందితులు పోలీస్ విచారణ వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం.

కొల్లు రవీంద్రను నేడు అదుపులోకి తీసుకుని విచారించే ఆలోచనలో పోలీసులు ఉన్నారు.ఈ కేసులో ఇప్పటికే.... మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు, టీడీపీ నేత చింతా చిన్నితో పాటు మరో ఇద్దరు అనుమానితులను ఆర్‌పేట పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 

రాజకీయంగా ఆధిక్యత చాటుకునేందుకే భాస్కరరావును హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై మరికొందరిని సైతం విచారించే అవకాశ వుంది. గత నెల 29న నడిబొడ్డున అందరూ చూస్తుండగా పట్టపగలు భాస్కరరావును హత్య చేయడం కలకలం రేపింది.

మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ముగ్గురికి సంబంధం ఉన్నట్లు నిర్థారణకు వచ్చారు. రాష్ట్ర రవాణా, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నానికి భాస్కరరావు ముఖ్య అనుచరుడు కావడం గమనార్హం. 

హత్య చేసిన అనంతరం ఓ నిందితుడు బైక్ పై పరారవుతుండగా సీసీ కెమెరాలకు చిక్కారు. రోడ్డుపై సిద్ధంగా ఉన్న బైక్ ఎక్కి పరారయ్యాడు ఓ నిందితుడు. ఇలా నగరంలోని వివిధ సిసి టివి పుటేజిని సేకరించిన పోలీసులు నలుగురు నిందితులను గుర్తించారు. వీరి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

భాస్కరరావు ఛాతీలో పొడిచిన ఒకే ఒక్క పోటు బలంగా దిగడంతో గుండెకు బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. నేరుగా గుండెకు గాయం కావటంతోనే భాస్కర రావు ప్రాణాలు విడిచారు. 

మంత్రి పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చిన తొలి నుండి ఆయనతోనే వుంటూ ముఖ్య అనుచరుడిగా పేరు తెచ్చుకున్నారు భాస్కరరావు. అటువంటి అత్యంత సన్నిహితుడి దారుణ హత్య విషయం తెలుసుకుని మంత్రి చలించిపోయారు. తన హోదాను సైతం మరిచిపోయి బాగా ఎమోషనల్ అయ్యారు

Follow Us:
Download App:
  • android
  • ios