స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ట్విస్ట్ : నాటి ఐఏఎస్‌లను విచారించాలని సీఐడీకి ఫిర్యాదు.. లిస్ట్‌లో అజేయ కల్లాం
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ హయాంలో స్కిల్ ప్రాజెక్ట్‌లో పాలు పంచుకున్న 12 మంది ఐఏఎస్ అధికారులను విచారించాలని ఏపీ సీఐడీకి ఫిర్యాదు అందింది . సీమెన్స్ ప్రాజెక్ట్ అమలు, పర్యవేక్షణ కమిటీలోని అధికారులను విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఫిర్యాదుదారు కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ హయాంలో స్కిల్ ప్రాజెక్ట్‌లో పాలు పంచుకున్న 12 మంది ఐఏఎస్ అధికారులను విచారించాలని ఏపీ సీఐడీకి ఫిర్యాదు అందింది. అప్పటి ఐఏఎస్ అధికారులు అజేయ కల్లాం, అజయ్ జైన్‌తో పాటు సీమెన్స్ ప్రాజెక్ట్ అమలు, పర్యవేక్షణ కమిటీలోని అధికారులను విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఫిర్యాదుదారు కోరారు. అప్పటి సీఎండీ బంగారు రాజాతో పాటు కార్పోరేషన్‌లోనీ సీఈవో, సీఎఫ్‌వో, ఈడీలను కూడా విచారించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా వున్న అజయ్ రెడ్డిపైనా ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
అసలేంటీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం:
ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2015లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,350 కోట్ల ప్రాజెక్టుకు డీల్ కుదుర్చుకుంది. జర్మనీ దేశానికి చెందిన ‘సీమెన్’ అనే సంస్థ ద్వారా యువకులకు పలు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. కాగా.. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది శాతం షేర్ ను చెల్లించాల్సి ఉంది.
అయితే ఏపీ ప్రభుత్వం షేర్ చెల్లింపుల్లో రూ.240 కోట్లను దారి మళ్లించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పాటు నకిలీ బిల్లులు తయారు చేసి, ఇన్‌వాయిస్‌లు సృష్టించి జీఎస్టీని ఎగవేశారని అభియోగాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఏపీ స్కిల్ కేసులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి ఏపీ సీఐడీకీ ఫిర్యాదు అందించారు.
కాగా.. గతంలోనే ఆ సంస్థ చైర్మన్, డైరెక్టర్ తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. 2021 జూలై నెలలో ఈ ఆరోపణలపై విచారణ జరపాలని వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. సీఐడీ రిపోర్టును బేస్ చేసుకొని ఆర్థిక లావాదేవీలపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఫొకస్ పెట్టింది.